అమరావతి: ‘ఫొని’ తీవ్ర పెను తుపాన్ గా మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హై అలర్ట్ ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు. అలాగైతే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు వీలు కలుగుతుందని సీఎం లేఖలో తెలిపారు.