తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు ఎట్టకేలకు శుక్రవారం పోలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో చాలా అంశాలే ప్రస్తావనకు వచ్చినా… ఎన్నికల్లో పార్టీకి దక్కిన ఘోర పరాభవానికి గల కారణాలేమిటన్న విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… టీడీపీ బలహీనతలనే తనకు అనుకూలంగా మలచుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీని చావుదెబ్బ కొట్టేశారని – తాను మాత్రం ఊహించని విక్టరీ అందుకున్నారని పోలిట్ బ్యూరో దాదాపుగా నిర్ధారించుకుందట. అంతేకాకుండా సామాజిక సమీకరణాల విషయంలో టీడీపీ బాగా వెనకబడిపోయిందని – అదే సమయంలో జగన్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టి దాదాపుగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారని కూడా పోలిట్ బ్యూరో అభిప్రాయపడింది.
ఇక ఎన్నికల సమయంలో మనీ మేనేజ్ మెంట్ విషయంలోనూ చంద్రబాబు కంటే కూడా జగన్ బెటర్ గా వ్యవహరించారని – వైసీపీ ఖర్చుపెట్టినంత మేర డబ్బు ఖర్చు చేయడంలో టీడీపీ వెనకబడిపోయిందని కూడా అభిప్రాయపడింది. డబ్బు పంపిణీకి సంబంధించి వైసీపీ అనుసరించిన వ్యూహం చాలా పక్కాగా – ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సాగిపోయిందని కూడా అభిప్రాయపడిందట. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులుగా టీడీపీ నేతల్లో మితి మీరిన విశ్వాసంతో ముందుకెళితే – మరికొందరు అసలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారని… అదే సమయంలో వైసీపీ ప్రతి విషయంలో టీడీపీ కంటే మెరుగ్గా వ్యవహరించిందని తేల్చింది. మనీ మేనేజ్ మెంట్ లో వైసీపీ వ్యవహరించిన తీరు తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారట.