AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్ జగన్ పాలన భేష్.. ఆ ఒక్కటి తప్ప!

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం దక్కించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జగన్ తనదైన శైలి నిర్ణయాలతో పారదర్శక పాలనకు రంగం సిద్ధం చేశారు. అటు ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అనూహ్య హామీల ద్వారా గత ప్రభుత్వం టీడీపీకి షాకులు తగులుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబులా సాగదీత ధోరణిలో వ్యవహరించకుండా.. ఏ విషయమైనా సూటిగా సుత్తిలేకుండా చెబుతూ.. అధికారులకు ఫుల్ […]

వైఎస్ జగన్ పాలన భేష్.. ఆ ఒక్కటి తప్ప!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 2:16 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం దక్కించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జగన్ తనదైన శైలి నిర్ణయాలతో పారదర్శక పాలనకు రంగం సిద్ధం చేశారు. అటు ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అనూహ్య హామీల ద్వారా గత ప్రభుత్వం టీడీపీకి షాకులు తగులుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబులా సాగదీత ధోరణిలో వ్యవహరించకుండా.. ఏ విషయమైనా సూటిగా సుత్తిలేకుండా చెబుతూ.. అధికారులకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు వైఎస్ జగన్. ఇదే టీడీపీలో గుబులు రేపుతున్న అంశం. అనుభవం లేని జగన్ పాలన అంతంత మాత్రంగా ఉంటుందని అంచనా వేసిన చంద్రబాబుకి అంతా రివర్స్ అయింది. వైఎస్ జగన్ అందరిని ఆశ్చర్యపరుస్తూ తనదైన శైలి పాలనతో ప్రజలకు అండగా ఉంటున్నారు.

ఎన్నో హామీలు, ఆపై మరిన్ని సమస్యలు.. అన్నింటిని కూడా చిరునవ్వుతో పరిష్కరిస్తున్నారు వైఎస్ జగన్. అటు కేంద్రం, ఇటు పొరుగు రాష్ట్రాల సీఎంలతో వైఎస్ జగన్ చెలిమిగా మెలుగుతూ రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్నారు. అసలే విడిపోయిన రాష్ట్రం.. రాజధాని లేదు, ఆర్ధిక సంక్షోభం ఇలా ఎన్నో సమస్యలు.. అయినా కూడా వైఎస్ జగన్ తన పరిపాలనలో అవినీతి అనేది లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తొలి నెలరోజుల పాలనలో తనదైన ముద్రవేశారు. జగన్‌ నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మేనిఫెస్టోనే మార్గదర్శి – వైఎస్ జగన్

ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ప్రతి సమావేశంలో కూడా అదే విషయాన్ని అధికారులకు చెప్పారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల్లోని అంశాలను ఫొటో ఫ్రేములు కట్టించి మరీ తన కార్యాలయంలో గోడలకు అలంకరించారు. మంత్రులు కూడా దీనికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రతి కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందేలా చూడాలని పేర్కొన్నారు.

అవినీతిరహిత పాలనే లక్ష్యంగా…

ఎన్నికల ముందు నుంచి కూడా అవినీతిరహిత పాలనకు వైసీపీ కట్టుబడి ఉంటుందన్న వైఎస్ జగన్.. అది అందించడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు వైఎస్ జగన్ కార్యాచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగా సహచరులకు, అధికారులకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా విచారిస్తానని.. ఒకవేళ రుజువైతే తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. అటు ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అసలు రాజీ పడొద్దని పోలీసు అధికారులకు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాగాన్ని మరింత పటిష్ట పరచాలని సూచించారు.

విభజన సమస్యల పరిష్కారానికి చొరవ…

రాష్ట్రం విడిపోయి ఐదు సంవత్సరాలు అయినా ఇంకా కొన్ని విభజన చట్టం సమస్యలు పరిష్కారం కాలేదు. ఇక వాటి పరిష్కారానికి వైఎస్ జగన్ చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ దిశగా చర్చలను వేగవంతం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐదుసార్లు కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం…

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై వైఎస్ జగన్ ఉక్కు పాదం మోపారు. ఇక వాటి కూల్చివేతను ప్రజావేదిక ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతోపాటు కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ మేరుకు పలువురుకు నోటీసులు సీఆర్డీఏ అధికారులు అందజేశారు.

నెల రోజుల పాలనలో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు 

రబీ సీజన్‌ నుంచే  వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు – పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం. పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్‌ను రూ.2,250కు పెంపు – వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి – అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం – పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.18 వేలకు పెంపు – హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు

ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ – అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు – తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు – మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు – అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు – వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ – వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు

ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్.. గత ప్రభుత్వం చేసిన దోపిడిపై కూడా విచారణ చేపట్టారు. ఇక ఏపీ ప్రజల చిరకాల కోరికైనా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మున్ముందు ఎటువంటి ప్రణాళికలు చేపడతారో వేచి చూడాలి.