ఏపీ సీఎంగా ఎన్నికైన జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా పాలనా వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఆయన నడుం బిగించారు. అవినీతి జరిగిన ప్రాజెక్టుల కాంట్రాక్టులను వెంటనే రద్దు చేస్తామని ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని..పారదర్శకంగా కొత్త కాంట్రాక్టులు తీసుకొస్తానని ప్రకటించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని..టెండర్ల విధానంలో నూతన మార్పులు ఉంటాయన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర తాను రెండు, మూడు రోజుల్లో అపాయింట్ మెంట్ తీసుకుని..టెండర్ల విధానంలో హైకోర్టు జడ్జీ చేత..జ్యుడిషయల్ కమీషన్ వేయాలని కోరుతామన్నారు.
ప్రతి కాంట్రాక్ట్ టెండర్‌కు పోకముందూ..జ్యుడిషీయల్ కమిషన్ దగ్గరకు పంపిస్తామన్నారు. హైకోర్టు జడ్జీ సూచనలు చేసినా..మార్పులు చేసినా..అవన్నీ పొందుపరిచి..అనంతరం టెండర్లు పిలుస్తామని ప్రకటించారు జగన్. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా నిబంధనల్లో మార్పు చేస్తామని ప్రకటించారు. ప్రతి కాంట్రాక్టును జ్యుడిషియరీ కమిటీ ముందు పెడుతామన్నారు. కమిటీ ఆమోదించాకే టెండర్లకు వెళుతామన్నారు. ఆరు నెలల నుండి సంవత్సర కాలం ఇవ్వండి..రాష్ట్రంలో ప్రక్షాళన చేసి చూపిస్తానని సీఎం జగన్ హామి ఇచ్చారు.