
ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 27 కిలో మీటర్ల మేర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ కూడా వేశారు. ఈ మేరకు రైతుల నుంచి భూమి తీసుకునేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. కొప్పరావూరులో రైల్వే లైన్ ఏర్పాటుపై దూకుడు పెంచారు. మొత్తం కొప్పరావూరులో 2.57 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 27 ఎకరాల 43 సెంట్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో భూసేకరణ చేయనున్నారు. ఇందుకోసం రైతులకు నోటీసులు జారీ చేశారు. భూసేకరణపై అభ్యంతరాలుంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 22న 3 గంటలకు ధ్రువపత్రాలు తీసుకురావాలని రైతులకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్‌తేజ సూచించారు.
నాలుగేళ్లలో ఎర్రుపాలెం- నంబూరు రైల్వే లైన్ పనులు పూర్తి
అమరావతి మీదుగా ఎర్రుపాలెం- నంబూరు మధ్య చేపడుతున్న కొత్త రైల్వే లైన్ పనులు నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. 56 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2 వేల 545 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.