Somireddy Win: ఐదుసార్లు ఓటమి.. యోధుడిలా పోరాడి చివరికి అనుకున్నది సాధించాడు..!

దేనికైనా టైం రావాలంటారు. ఆయన టైం ఇప్పుడొచ్చింది. ఐదు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినా, రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ నాయకుడిని ఎట్టకేలకు విజయం వరించింది. ఆరో ప్రయత్నంలో గెలుపు గుర్రమెక్కారు నెల్లూరు జిల్లా మాజీమంత్రి. కయ్యానికి కాలుదువ్వే చిరకాల ప్రత్యర్థిని ఓడించి విక్టరీ సింబల్‌ చూపించారు.

Somireddy Win: ఐదుసార్లు ఓటమి.. యోధుడిలా పోరాడి చివరికి అనుకున్నది సాధించాడు..!
Somireddy Chandramohan Reddy

Updated on: Jun 04, 2024 | 9:02 PM

దేనికైనా టైం రావాలంటారు. ఆయన టైం ఇప్పుడొచ్చింది. ఐదు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినా, రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ నాయకుడిని ఎట్టకేలకు విజయం వరించింది. ఆరో ప్రయత్నంలో గెలుపు గుర్రమెక్కారు నెల్లూరు జిల్లా మాజీమంత్రి. కయ్యానికి కాలుదువ్వే చిరకాల ప్రత్యర్థిని ఓడించి విక్టరీ సింబల్‌ చూపించారు.

పరీక్షల్లో ఫెయిలయిన పిల్లలెంత బాధపడతారో అంతకంటే ఎక్కువ ఆవేదనే ఉంటుంది ఓడిపోయిన నాయకులకు. కొందరు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించినా విఫలమవుతారు. కొందరు ఏదో రోజు విక్రమార్కుల్లా మళ్లీ పట్టు నిలబెట్టుకుంటారు. సింహపురిలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చివరికి అనుకున్నది సాధించారు. ఐదు సార్లు ఓటమిపాలైనా అలుపెరగని యోధుడిలా పోరాడి చివరికి అనుకున్నది సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ సీనియర్‌ సోమిరెడ్డి.

నెల్లూరుజిల్లాలో అన్ని నియోజకవర్గాలకంటే ప్రజలంతా ఎక్కువ ఆసక్తి చూపింది సర్వేపల్లిపైనే. పార్టీ సీనియర్‌ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి అక్కడ పోటీలో ఉండటం, ప్రత్యర్థి అన్నివిధాలా బలమైన మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి కావటంమే అందరి ఆసక్తికీ కారణం. నువ్వానేనా అన్నట్లు జరిగిన ఫైట్‌లో చివరికి 14వేల పైచిలుకు మెజారిటీతో కాకాణిపై గెలిచారు సోమిరెడ్డి. హ్యాట్రిక్‌ కొట్టాలనుకున్న కాకాణి ఆశలను టీడీపీ వేవ్‌లో చిత్తుచేయగలిగారు.

నాలుగు దశాబ్దాలుగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్న సోమిరెడ్డి 1994 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో కీలక శాఖల మంత్రిగా వ్యవహరించారు.1999లో కూడా రెండోసారి గెలిచి మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ప్రభంజనంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అదాల ప్రభాకర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు సోమిరెడ్డి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్‌ రెడ్డి చేతిలోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. ఓసారి కోవూరు ఉప ఎన్నికల్లో నల్లపరెడ్డి చేతిలో ఓడిపోయారు.

2019లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలని భావించింది టీడీపీ అధిష్ఠానం. మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్‌ ఇవ్వబోమని స్వయంగా నారా లోకేష్‌ ప్రకటించటంతో సోమిరెడ్డికి టికెట్‌ ఇవ్వరన్న చర్చ జరిగింది. దానికి తగ్గట్లే పార్టీలో అంత సీనియర్‌ అయినా రెండు జాబితాల్లో ఆయన పేరు ప్రకటించలేదు. అయితే పార్టీ అధినేతతో సోమిరెడ్డికి ఉన్న అనుబంధంతో ఆయన కోడలు శృతికి టికెట్‌ ఇవ్వాలని అనుకున్నారు. కానీ వైసీపీ అభ్యర్థి కాకాణిని ఎదుర్కోవాలంటే తానైతేనే సాధ్యమని అధిష్ఠానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు సోమిరెడ్డి. ఈసారి ప్రచారంలో సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇవే తనకు ఆఖరు ఎన్నికలని.. మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకెళ్లారు.

ఫలితం తేడా వస్తే ఓటమిలో డబుల్‌ హ్యాట్రిక్‌ అయ్యేది. కానీ రాష్ట్రంలో కూటమి వేవ్‌కి తోడు సోమిరెడ్డికి సానుభూతి కూడా కలిసొచ్చింది. సర్వేపల్లిలో తిరుగులేదనుకున్న కాకాణి గోవర్దన్‌రెడ్డి అంచనా తప్పింది. మొన్నటి దాకా జిల్లా మంత్రిగా కాకాణి చక్రం తిప్పితే.. సోమిరెడ్డి గెలుపుతో సింహపురి రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ మారిపోయేలా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…