కూటమి అధికారంలోకి రాగానే.. ఆ ఫైల్‌పైనే తొలి సంతకం: చంద్రబాబు

కోనసీమ జిల్లాను కలహాల సీమగా మార్చిన జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా పాల్గొన్నారు.

కూటమి అధికారంలోకి రాగానే.. ఆ ఫైల్‌పైనే తొలి సంతకం: చంద్రబాబు
Pawan Kalyan -Chandrababu Naidu

Updated on: Apr 11, 2024 | 9:30 PM

కోనసీమ జిల్లాను కలహాల సీమగా మార్చిన జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా పాల్గొన్నారు.

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో కూటమి అభ్యర్థుల తరపున భారీ రోడ్‌ షో నిర్వహించారు..చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. అనంతరం ప్రజాగళం సభలో ఉమ్మడిగా ప్రసంగించారు. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే కూటమి విజయం ఇప్పటికే ఖాయమైనట్టు కనిపిస్తోందన్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని.. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందని చెప్పారు. తమ పార్టీల జెండాలు వేరైనా..అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే అజెండా అని తేల్చిచెప్పారు.

రాష్ట్రాన్ని కాపాడడానికి, యువతలో భరోసా నింపేందుకు త్రివేణి సంగమంలా తమ మూడు పార్టీలు కలిశాయన్నారు పవన్‌ కల్యాణ్‌. ప్రజలను గెలిపించేందుకే తగ్గామన్నారు. తాను పిఠాపురం నుండే పోటీ చేస్తున్నానని..కోనసీమ ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్‌ఫర్‌ అయితేనే కూటమి ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు కూటమి నేతలు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆలోచించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.