Amalapuram: అలా చేయడం సమంజసం కాదు.. కోనసీమ ఘటనపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..

|

May 28, 2022 | 9:06 AM

అమలాపురం ఘటనపై నటుడు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు. కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నారాయణమూర్తి పేర్కొన్నారు.

Amalapuram: అలా చేయడం సమంజసం కాదు.. కోనసీమ ఘటనపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..
Narayana Murthy
Follow us on

Narayana Murthy – Konaseema: కోనసీమ జిల్లాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. జిల్లా పేరు మార్చాలన్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. అమలాపురం ఘటనపై నటుడు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు. కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నారాయణమూర్తి పేర్కొన్నారు. దాడులు దారుణమని, నాయకుల ఇళ్లు తగులబెట్టడం సమంజసం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ పేరు జిల్లాకే కాదు.. దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేడ్కర్‌ ఇండియాగా పేరు మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న పీఎం మోదీ మాట తప్పారంటూ విమర్శించారు. దేశానికి రైతే రాజు అని.. రైతును బికారి చేసే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్వామినాథన్‌ కమిషన్‌ 2006లో నివేదిక ఇచ్చిందని, ఆ నివేదిక ఇప్పటికీ అమలుకావడం లేదని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు చారిత్రాత్మకమైన పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 22వ రాష్ట్ర మహాసభ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలో జరుగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే.. కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సెల్‌ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు పట్టుకొని నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసతో, ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోవడంతో వర్క్‌ ఫ్రంహోం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్‌వర్క్‌ కోసం జిల్లా సరిహద్దులు దాటి, ల్యాప్‌టాప్‌లతో వెళ్లి వర్క్‌ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..