
తిరుపతి, జనవరి 30: తిరుపతిలో ఏసీబీ రైడ్ తీవ్ర కలకలం రేగింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో ఐదు చోట్ల ఏసీబీ దాడులు చేశారు. కపిలతీర్థం వద్ద ఉన్న అతడి ఇంట్లో, గిరిపురం, గెస్ట్ లైన్ రోడ్డు, రేణిగుంట రోడ్డులోని ఇళ్లల్లో సోదాలు జరిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా లోని పొదలకూరు, మహిపాడులోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న తిరుమలేష్ అవినీతి ఆరోపణలపై గతేడాదే సస్పెండ్ అయ్యాడు.
రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగిగా ఉన్న తిరుమలేశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో తిరుమలేశ్‌ను అధికారులు హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అతడి ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, భవనాలు సహా 11 చోట్ల జరిపిన దాడుల్లో ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. 1.472 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, రూ. 15.26 లక్షల నగదు, ఓ కారు, 3 బైకులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
మరో రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉండటంతో వాటిని తెరవాల్సి ఉంది. గతంలో కారుణ్య నియామకం కింద సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఆఫీస్ సబార్డినేట్‌గా తిరుమలేశ్ ఉద్యోగంలో చేరాడు. అనంతరం తొట్టంబేడు, తిరుపతి, రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అటెండర్‌గా పని చేశారు. అయితే అటెండర్‌గా ఉన్న అతడు పలు సందర్భాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 2025 అక్టోబర్‌లో తిరుమలేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఏకంగా కోట్లలో డబ్బు కూడబెట్టడంతో తాజాగా ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. డిసిపల్లిలోని ఎస్సీ కాలనీలో ఉన్న తిరుమలేశు బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేసింది. నల్లిపోగు శీను తో పాటు.. మరొకరి ఇంట్లో నిన్న ఉదయం నుంచి అధికారులు సోదాలు చేస్తున్నారు. రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండెంట్ తిరుమలేశ్ స్వగ్రామం డిసిపల్లి కావడంతో గురువారం నుంచి సోదాలు మొదలుపెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.