వానలు పోయాయ్.. ఎండలు ముదరనున్నాయ్. అవును.. మంగళవారం 15 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చని తెలిపింది. రాబోయే వారాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని APSDMA పేర్కొంది. 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
మంగళవారం అల్లూరి సీతారామరాజులోని ఆరు మండలాలు, అనకాపల్లి, కాకినాడలో మూడు మండలాలు, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం అనకాపల్లి జిల్లా కె కోటపాడులో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కసింకోటలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వృద్ధులు, పిల్లలు ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రజలు డీహైడ్రేషన్‌కి గురికాకుండా వాటర్ ఎక్కువగా తాగాలంటున్నారు. కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతు ఉండాలంటున్నారు.
ఇక ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం అది వాయుగుండంగా మారే అవకాశముంది. ఆపై ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. ఇది క్రమంగా పుంజుకుని ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..