Andhra Pradesh: ఖాకీ వనంలో కీచకుడు.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఇదేం పని..!
న్యాయం కావాలని స్టేషన్‌కు వెళ్లిన మహిళకు అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఇన్స్‌పెక్టర్ అసభ్యంగా ప్రవర్తిండానికి ఎస్పీ ముందు గోడు వెళ్లబోసుకుంది ఓ మహిళ. తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను వేడుకుంది. ఈ దారుణ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.

శ్రీసత్యసాయి జిల్లాలో న్యాయం కోసం మడకశిర పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. దీనిపై పుట్టపర్తిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బంధువులతో గొడవపై స్టేషన్‌కు వెళ్లి చెప్పుకుందామంటే సీఐ రామయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడని వివాహిత ఆరోపిస్తోంది. విచారణ పేరుతో ప్రతి ఐదు నిమిషాలకోసారి స్టేషన్ లోపలకు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
వ్యక్తిగత విషయాలు అడుగుతూ సీఐ రామయ్య వేధించాడని ఆరోపించింది. భర్త లేడు కదా.. రాత్రి 10 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండాలని సీఐ చెప్పాడని అంటోంది బాధితురాలు. తనతో గొడవపడిన వారిని వదిలేశారంటోంది. అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయ అంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎస్పీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోపణల్లో నిజమెంత? అని తెలుసుకుని.. అందులో నిజముందని తెలిస్తే శాఖపరమైన తీసుకునే అవకాశం ఉంది..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..