అందమైన చేతిరాతతో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించవచ్చు అని జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు రామ్మోహన్ ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన చేతిరాతపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల అందమైన చేతిరాత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
గత కొంతకాలంగా కాలీగ్రఫీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గుంటూరులో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక టీచర్ల సాయంతో తమ విద్యార్ధులకు కాలీగ్రఫీపై శిక్షణ ఇప్పిస్తున్నారు. నేర్చుకునే నైపుణ్యంలో వినటం, చదవడం, మాట్లాడటం, రాయడం ముఖ్యమైన అంశాలు. అయితే సాధారణంగా విద్యార్ధులు వినటం, చదవడం, మాట్లాడటంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కానీ రాయడంపై మాత్రం అవగాహన లేకపోవడంతో దాని గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కాలీగ్రఫీపై సరైన అవగాహన లేకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు కాలీగ్రఫీపై శిక్షణ ఇచ్చి వారిని మెరుగ్గా తీర్చదిద్దాలని భావించారు. అయితే తాను లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం కష్టంగా భావించారు. విద్యార్ధులకు బదులుగా టీచర్లకే శిక్షణ ఇస్తే వారు జీవిత కాలంపాటు ఎంతోమందిని తీర్చిదిద్దుతారని తన స్నేహితుడి ఇచ్చిన సలహాతో రంగంలోకి దిగారు. ప్రస్తుతం నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు, నలభై వేల మంది విద్యార్ధులకు కాలిగ్రఫీపై శిక్షణ ఇచ్చారు. రానున్న రోజుల్లో లక్ష మంది విద్యార్ధుల చేతిరాత మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రామ్మోహన్ చెప్పారు.
సెలవు దినాల్లో ఏపీలోని జిల్లాల వ్యాప్తంగా ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ అని వసతులను ఏర్పాటు చేసి ప్రభుత్వ టీచర్లకు ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కాలీగ్రఫీ టీమ్ ఏర్పడింది. అందరూ స్వచ్చందంగా ముందుకొచ్చి ప్రభుత్వ టీచర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు. చేతిరాతతో తమ వ్యక్తిత్వం కూడా మారిపోతుందని చేతిరాత బాగుండే ఉపాధ్యాయుల పట్ల విద్యార్ధులు కూడా ఆకర్షితులవుతారని రామ్మోహన్ చెప్పారు. అయితే శిక్షణ కార్యక్రమాలకు హాజరైన ఉపాధ్యాయులు చేతిరాతను ఈ వయస్సులో నేర్చుకోవడం సంతోషంగా ఉందని తాము నేర్చుకున్న కాలీగ్రఫీని విద్యార్ధులకు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వమే కాలీగ్రఫీపై దృష్టి పెట్టి టీచర్లకు శిక్షణ ఇవ్వాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు.