AP News: అయ్యో దేవుడా.. ఆ తండ్రికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? గుండె తరుక్కుపోయే ఘటన..

| Edited By: Velpula Bharath Rao

Dec 06, 2024 | 3:38 PM

పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని బైక్‌పై ఓ తండ్రి తరలించిన హృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

AP  News: అయ్యో దేవుడా.. ఆ తండ్రికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? గుండె తరుక్కుపోయే ఘటన..
A Father Carrying His Dead Son On His Shoulder In Parvathipuram Andhra Pradesh
Follow us on

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని బైక్‌పై తరలించినహృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కురుపాం మండలం నీలకంఠాపురానికి చెందిన కొండగొర్రి అశోక్, స్వాతిలకు రెండు నెల క్రితం బాబు పుట్టాడు. ఆ బాబుకి రోహిత్ అని పేరు పెట్టారు. అలా మగ బిడ్డ పుట్టాడన్నా ఆనందంలో ఉండగానే అకస్మాత్తుగా రోహిత్‌కి అనారోగ్య సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే రోహిత్ ఆరోగ్యం మరింత విషమించి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే రోహిత్‌ను తీసుకొని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే రోహిత్ చికిత్స పొందుతూనే అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు.

ఇక చేసేదిలేక మృతి చెందిన బిడ్డను తమ స్వగ్రామానికి తరలించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అందుకోసం తమకు ఒక అంబులెన్స్ కావాలంటూ ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం అంబులెన్స్ రిపేర్ అయిందని, ఇవ్వటం కుదరదని చెప్పారు. ఎంత సేపు బ్రతిమలాడినా ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇచ్చేందుకు ససేమిరా అని నిరాకరించారు. ఇక చేసేది లేక బిడ్డ మృతదేహాన్ని తీసుకొని బస్సు ఎక్కారు. మృతదేహం అని తెలిస్తే బస్సు ఎక్కనివ్వరని మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టుకుని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి కురుపాం వరకు ప్రయాణించారు. అనంతరం అక్కడనుండి తమ బంధువుల బైక్ సహాయంతో కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి తరలించేందుకు నరక యాతన అనుభవించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవత్వం లేకుండా వ్యవహరించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి