సెంటు స్థలం కోసం కాలు దువ్వుతున్న, కాళ్లు, చేతులు నరుక్కుంటున్న సీమలో.. తనకున్న యావదాస్తిని ధారదత్తం చేశారు ఓ దంపతులు. కోట్ల విలువ చేసే ఆస్తిని కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వర స్వామి ఆలయానికి రాసి ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సంఘటన సంచలనంగా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది ఆలయానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చి శ్రీకామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. రిటైర్డ్ లెక్చరర్ అయిన రాజు అనే భక్తుడు, రెండు కోట్లకు పైగా విలువైన 2.10 ఎకరాల సాగు భూమి, ఒక ఇంటిని ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి దాత రాజు, శకుంతల దంపతులకు ఆలయ మర్యాదలతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు దంపతులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో దాత రాజు, శకుంతల దంపతులను ఘనంగా సన్మానించారు ఆలయ నిర్వాహకులు. శాలువాతో సత్కరించి, అర్చకులు వేద ఆశీర్వచనం మద్య తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు చిన్నప్పటి నుంచి శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి భక్తుడు. గతంలో కూడా అతనికి ఉన్న పొలాన్ని ఆలయానికి రాసి ఇచ్చారు. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు పైగా భూమిని ఆలయానికి అందజేశారు. కోట్ల విలువైన స్థలం రాసి ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెంటు స్థలం కోసం కత్తులు దువ్వే రాయలసీమలో దేవుడి పై భక్తితో కోట్ల విలువైన భూమి భక్తితో ధారాదత్తం చెయ్యడం ఎంతో గొప్ప విషయం అంటూ ప్రముఖులు దాత రాజును ప్రశంసిస్తూన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..