
తిరుపతి రూరల్ అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో ఓ కస్టమర్ చేతివాటం ప్రదర్శించాడు. బ్యాంకులో పని ఉన్నట్టు యాక్ట్ చేశాడు. పేపర్ పట్టుకుని బ్యాంకులో హడావుడి చేసి గోల్డ్ లోన్ రెన్యువల్ చేస్తున్న కౌంటర్ పై కన్నేశాడు. కౌంటర్ వద్ద ఒక మహిళ గోల్డ్ లోన్ రెన్యువల్ చేసేందుకు కుర్చీలో కూర్చొని ఉండగా.. అప్రైజర్ ను గమనించాడు. అప్రైజర్ కాస్త అజాగ్రత్తగా ఉండటాన్ని గమనించి చేతివాటాన్ని ప్రదర్శించాడు. చేతిలో పేపర్ పట్టుకుని కౌంటర్ దగ్గరికి వెళ్లి అడ్డుగా ఉన్న డోర్ ను ముందుకు నెట్టాడు. చేతిలోని పేపర్‌ను ఉపయోగించి.. దానిని అడ్డుపెడుతూ.. గోల్డ్ తూకం వేసి రెన్యువల్ చేసేందుకు కవర్ లో ఉన్న ఉంచిన 60 గ్రాముల బంగారాన్ని కొట్టేశాడు. ఎవరూ చూడకపోవడంతో.. హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్రైజర్ అజాగ్రత్తగా ఉన్నాడని గమనించి తెలివిగా గోల్డ్ ప్యాకెట్ ను కొట్టేసిన కేటుగాడి నిర్వాకాన్ని అక్కడే ఉన్న మహిళ కూడా గమనించలేకపోయింది.. అయితే.. ఎవరూ గమనించకపోయినా మూడో కంటికి మాత్రం దొరికిపోయాడు.
గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం కౌంటర్ వద్ద మహిళ వేచి ఉండగానే గోల్డ్ ప్యాకెట్ మాయం కావడంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. 60 గ్రాముల బంగారు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. అంతా వెతికి ఆఖరికి సీసీ కెమెరాను పరిశీలించారు. గోల్డ్ ప్యాకెట్ కొట్టేసిన ఘనుడి బాగోతం సీసీ కెమెరాలో రికార్డయింది.. దీంతో గోల్డ్ ప్యాకెట్ అపహరించిన కేటుగాడి నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన విజువల్ తో బ్యాంకు మేనేజర్ గిరీష్ కుమార్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..