Strange Incident: నెల్లూరు జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. మాములుగా అయితే పొలాల్లో లంకెబిందెలు, వజ్రాలు(Diamonds) బయటపడటం మనం ఇప్పటివరకు చూశాం. కానీ రైతు(Farmer) పొలంలో ఊహించని రీతిలో బీరువాలు, బైక్ బయటపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొన్నామధ్య ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పెన్నానది(Penna River)కి వరదలు రావడంతో చెరువు కట్ట తెగిపోయి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం వరదలో అల్లాడింది. పొలాలతో పాటు గ్రామం కూడా వరద నీటిలో మునిగిపోయింది. గ్రామం ఒడ్డున పడింది కానీ… పొలాల్లో కొద్ది నెలకులుగా నీళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగరాజు అనే రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేపట్టలేకపోయారు. గురువారం రోజున తన పొలంలో నీళ్లు మళ్లించి, బురదను తొలగించే పనులను ప్రారంభించాడు. నీళ్లు బయటకు పంపిన తర్వాత భూమిలో నుంచి 6 బీరువాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. దీంతో నాగరాజు కంగుతిన్నాడు. గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో.. రాజుకాలనీకి చెందిన కొందరు తమ బీరువాలేనని వాటిని తీసుకెళ్లారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి అదే చేలో.. బైక్ కూడా బయటకు రావడంతో వెంటనే నాగరాజు స్థానిక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వర్షాలు, వరదలు కారణంగానే బీరువాలు వరదలకు కొట్టుకుని ఇలా పొలాల్లోకి చేరి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ చుట్టుపక్కల పొలాల్లో కూడా తనిఖీలు చేస్తే.. మరికొందరి వస్తువులు బయటపడతాయేమో అంటున్నారు గ్రామస్థులు.
Also Read: భార్యపై ప్రేమతోనే చైన్‌స్నాచింగ్ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు