టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని ఓ బుడుతడు పలు అవార్డులు గెలుచుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాడు. అబ్దుల్ కలామ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఎసియన్ గ్రాండ్ మాస్టర్ అవార్డు కేవలం 5 సంవత్సరాల వయస్సులోనే 5 రికార్డ్ లను సొంతం చేసుకున్నాడు. ఆ బాలుడి పేరే జశ్వంత్ శ్రీయాస్. ఎంతటి పజిల్స్‌నైనా, శ్లోకాలనైనా ఇట్టే చెప్పేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ఎస్సైగా పనిచేస్తున్న రామకృష్ణ , దేవయాని దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు జశ్వంత్ శ్రీయాస్. చదువులో అతడి మేదో పరిజ్ఞానాన్ని గుర్తించింది తల్లి దేవయాని. దీంతో ఆ పిల్లాడికి రెండు సంవత్సరాల వయసు నుంచే అన్ని రకాల పజిల్స్, శ్లోకాలు, జంతువుల పేర్లను నేర్పిస్తూ తన కొడుకును ప్రోత్సహించారు. జశ్వంత్‌కు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అతని టాలెంట్‌ను గుర్తించి అవార్డు అందజేశారు.
2021 సంవత్సరంలో అబ్దుల్ కలాం వరల్డ్ రికార్డ్. 2022 సంవత్సరంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మూడు, 2023లో ఏషియన్ గ్రాండ్ మాస్టర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ చిన్నారి గ్రామీణ స్కూల్లోనే చదవడం గమనార్హం. చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో సెయింట్ లూయిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జశ్వంత్ చదువుతున్నాడు. పజిల్స్, యానిమల్స్ పేర్లు, స్టోరీస్, పలు వాటిలో పరిజ్ఞానం ఉండడంతో అవార్డులు సొంతం చేసుకున్నాడు. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులుగా తమకు ఎంతో ఆనందంగా ఉందని వాళ్లు చెబుతున్నారు. చిన్న కుమారుడు కూడ ఇటీవల అబ్దుల్ కలాం వారి రికార్డు వచ్చిందని తెలిపారు. దానికి తమ పెద్ద కొడుకు జశ్వంత్.. చిన్న కుమారుడ్ని ప్రోత్సహించి తన తమ్ముడికి అబ్దుల్ కలాం రికార్డు వచ్చేలా చేశాడని చెప్పారు. చిన్న వయసులోనే తమ పిల్లల్లో ఉన్న టాలెంట్ తో తాము చాలా గర్విస్తున్నామని రామకృష్ణ దేవయాని దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.