వారంతా దుస్తులు ఉతకడానికి గ్రామంలోని చెరువు దగ్గరకు వెళ్లారు.. అంతా సరదాగా మాట్లాడుకుంటూ.. దుస్తులు ఉతుకుతున్నారు.. ఈ క్రమంలో ఐదేళ్ల పిల్లాడు.. చెరువులోకి దిగాడు.. ఆడుకుంటూనే లోతులోకి వెళ్లి మునిగిపోయాడు.. గమనించిన అక్కడున్న ఇద్దరు మహిళలు.. పిల్లాడిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా ప్రయత్నిస్తూనే వారిద్దరూ కూడా నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో చోటుచేసుకుంది.
చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో ఐదేళ్ల బాలుడు లక్కీ (లోకేష్) పడ్డాడు. ఈ క్రమంలో లోకేష్ ను కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు మహిళలు నీటిలో మునిగిపోయారు. ఈతరాకపోవడంతో చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతులు సలోని (25), మరియమ్మ (28), లోకేష్ (5) గా గుర్తించారు.
గ్రామస్థుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థుల సహాయంతో నీటిలో మునిగి చనిపోయిన ముగ్గురిని బయటకు వెలికితీశారు. అనంతరం ముగ్గురిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, మృతులు మరియమ్మ, సలోని, లోకేష్ ప్రమాదవ శాత్తు జారిపడి చనిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..