
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ఆశ్చర్యకర మెడికల్ కేసు వెలుగుచూసింది. ఓ 28 ఏళ్ల మహిళ విపరీతమైన వాంతులతో ప్రవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించిన డాక్టర్ రామచంద్రారెడ్డి.. ఎండస్కోపి టెస్ట్ చేసి స్టన్ అయ్యారు. ఆమె కడుపు లోపల చిన్న పేగు వద్ద ఏకంగా నాలుగు పెన్నులు ఉండటాన్ని గమనించారు. వెంటనే లాపరోస్కోపిక్ పద్దతిలో సర్జరీ చేసి జీర్ణాశయానికి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా ఆ పెన్నులను తొలగించారు. సర్జరీ అనంతరం ఆమెను నాలుగు రోజులు లిక్విడ్ డైట్‌లో ఉంచి.. కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు.
ఆ మహిళ పెన్నులు ఎందుకు మింగిందన్నది ఇంకా తెలియలేదు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఆమె మానసిక స్థితిపై కూడా వైద్యులు పరిశీలన చేస్తున్నారు. పెన్నులను గమనించకపోతే జీర్ణాశయంలో రంధ్రాలు ఏర్పడి, ప్రాణాపాయం తలెత్తే ప్రమాదం ఉండేదని వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. భర్తతో ఉన్న విబేధాల కారణంగానే ఆమె పెన్నులు మింగిదని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.