కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం ఏ.కొత్తపల్లి దగ్గర ఓ టిప్పర్.. ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, క్లీనర్‌తోపాటు ఆలయంలో నిద్రిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు. గ్రావెల్ లోడుతో వెళ్తన్న టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో వినాయక ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళితే.. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న లారీ.. ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ కోనూరు నాగేంద్ర(23)తోపాటు గుడిలో నిద్రిస్తున్న స్థానికుడు సోము లక్ష్మణరావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శేఖర్, నాగేంద్రలను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని గురజాల ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక.. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..