ఇటీవల వర్షాలు, వరదల కారణంగా పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కడ చూసినా పాములే కనబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లు, కార్లు, బైకులు ఎక్కడపడితే అక్కడ రకరకాల పాములు దర్శనమిస్తున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రక్తపింజర పాములు కలకలం రేపాయి. కొబ్బరి కొమ్మలు ఆటోలో లోడ్ చేస్తుండగా కమ్మల గుట్టకింద రెండు పెద్ద పెద్ద పాములు కనిపించాయి. వాటిని చూసి కొండచిలువలుగా భావించిన రైతులు దెబ్బకు భయపడి అక్కడినుంచి పరుగులు తీసారు.
జిల్లాలోని ముమ్మిడివరం మండలం మల్లయ్యగారిపాలెం వద్ద పంటపొలాల్లో ఈ పాములు కనిపించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాములను చూసి తీవ్ర భయాందోళన చెందారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పాములను చూసి అవి కొండచిలువలు కావని, అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పాములని తెలిపారు. వాటిని ఎంతో చాకచక్యంగా డబ్బాలో బంధించారు గణేష్ వర్మ. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతానని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రక్తపింజర్లు ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవని, ఇవి క్వారీ ఏరియాల్లో ఎక్కువగా ఉంటాయని స్నేక్ క్యాచర్ తెలిపారు. కొత్త రోడ్ల నిర్మాణంలో భాగంగా గ్రావివ్ వెంబడి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఈ పాములు పొలాలు, కొబ్బరి తోటల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ పాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ పాము కనిపించినా వాటిని చంపకుండా వెంటనే తనకు సమాచారమివ్వాలని సూచించారు. వాటిని బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..