Andhra Pradesh: ‘అయ్యా డాక్టరూ.. పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా!’

|

Jun 02, 2024 | 3:51 PM

ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం ఆ తల్లిదండ్రులకు తీరని కడపుకోత మిగిల్చింది. ముల్లుకు, పాము కాటుకు తేడా తెలియని వైద్యులు ఓ చిన్నారి మరణానికి కారకులయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కళ్లముందే ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఫ్లెక్సీతో వినూత్నంగా తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది..

Andhra Pradesh: అయ్యా డాక్టరూ.. పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా!
Medical Negligence
Follow us on

టెక్కలి, జూన్ 2: ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం ఆ తల్లిదండ్రులకు తీరని కడపుకోత మిగిల్చింది. ముల్లుకు, పాము కాటుకు తేడా తెలియని వైద్యులు ఓ చిన్నారి మరణానికి కారకులయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కళ్లముందే ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఫ్లెక్సీతో వినూత్నంగా తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయి వినీత్‌ (12) అనే బాలుడు క్రికెట్‌ ఆడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. ఏదో కుట్టినట్లు అనిపించినా ముల్లు గుచ్చుకుందని బాలుడు తొలుత భావించాడు. కానీ కొద్దిసేపటికే వినీత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వినీత్‌ను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు కూడా బాలుడి కాలికి ఉన్న గాయాలను చూసి ముల్లు గుచ్చుకుందని భావించారు. దీంతో వైద్యులు దాదాపు రెండు గంటల పాటు సమయం వృథా చేశారు. తీరా పరిస్థితి విషమించాక బాలుడిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. సమయం మించి పోవడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా బాలుడు మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే తమ బిడ్డ ప్రాణాలు వదలడంతో బాలుడి తల్లిదండ్రులు దాసరి మురళి, నిరోష గుండెలు బాదుకుంటూ రోధించారు.

తీవ్ర ఆవేదన చెందిన బాలుడి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘ఓ తల్లికి కడుపుకోడ’ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘పాముకాటుకు, ముల్లుకు తేడా తెలియని వైద్య సిబ్బందికి శతకోటి వందనాలు’ అంటూ జిల్లా ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కూడలి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డ మరణానికి కారణమైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైద్యశాఖ కమిషనర్‌ను ఫ్లెక్సీలో వేడుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.