AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివిరా.. తనకు పుట్టలేదంటూ కొడుకును హింసించి..

తెల్లగా ఉన్న తండ్రికి నల్లటి పిల్లవాడు పుట్టకూడదా.. నలుపు రంగు భర్త ఉన్న మహిళ తెల్లటి పిల్లవాడికి జన్మ నివ్వకూదదా.. ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం , కాఫీ రంగులో ఉండే వక్క కలిపి నమిలితే నోరు ఎర్రగా పండినట్లు.. తల్లిదండ్రుల మేని ఛాయకు పుట్టిన బిడ్డ రంగుకు ఖచ్చితంగా సారూప్యం ఉండాలనే నిభందన లేదు. కానీ..

Andhra: నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివిరా.. తనకు పుట్టలేదంటూ కొడుకును హింసించి..
Crime News
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 11, 2026 | 10:08 AM

Share

ఏలూరు: తెల్లగా ఉన్న తండ్రికి నల్లటి పిల్లవాడు పుట్టకూడదా.. నలుపు రంగు భర్త ఉన్న మహిళ తెల్లటి పిల్లవాడికి జన్మ నివ్వకూదదా.. ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం , కాఫీ రంగులో ఉండే వక్క కలిపి నమిలితే నోరు ఎర్రగా పండినట్లు.. తల్లిదండ్రుల మేని ఛాయకు పుట్టిన బిడ్డ రంగుకు ఖచ్చితంగా సారూప్యం ఉండాలనే నిభందన లేదు. కానీ, ఇలా లేని పోనీ అనుమానాలతో ఒక వ్యక్తి తన దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకోవటమే.. కాకుండా ముక్కుపచ్చలారని పిల్లవాడి ప్రాణం సైతం బలి తిసుకున్నడనే ఆరోపణలు మనసులను కలచివేస్తున్నాయి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలో ఈ ఘటన వెలుగు చూసింది. కన్నకొడుకు అని కూడా చూడకుండా, ఆ బాలుడు తనకు పుట్టలేదన్న వికృత ఆలోచనతో ఓ తండ్రి చేసిన వేధింపులు చివరకు ఆ చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి. 11 ఏళ్ల రిషిబాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.

నాయుడుగూడెంకు చెందిన పిట్టా వినోద్‌కు, పెదపాడుకు చెందిన ఓ మహిళతో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిషిబాబు (11) అనే కుమారుడు ఉన్నాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే వినోద్‌ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. పుట్టిన కుమారుడు తనవాడు కాదంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన సదరు మహిళ, తొమ్మిదేళ్ల క్రితం తన కుమారుడిని తీసుకుని పెదపాడులోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కుమారుడి బాగోగులన్నీ తల్లి, ఆమె తరపు బంధువులే చూసుకుంటూ వచ్చారు. 2024లో పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీతో వినోద్‌ మనసు మార్చుకున్నాడని నమ్మి అతడి భార్య పిల్లలను తీసుకుని తిరిగి నాయుడుగూడెం చేరుకుంది.

అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత కూడా వినోద్‌ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కుమారుడిని కనీసం పాఠశాలకు కూడా పంపకుండా.. “నువ్వు నా కొడుకువి కాదు” అంటూ నిత్యం హింసించేవాడు. ఈ వేధింపులపై బాధితురాలు గతంలో ఐసీడీఎస్ (ICDS) అధికారులను ఆశ్రయించగా, వారు వినోద్‌కు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా అతని వికృత మనస్తత్వం మారకపోగా, మరింత కక్ష పెంచుకుని చిన్నారిని వేధించడం మొదలుపెట్టాడు.

శనివారం ఉదయం పెదపాడులోని బాలుడి తాత బండి రమేష్‌కు స్థానికుల నుంచి ఒక ఫోన్ వచ్చింది. నాయుడుగూడెంలోని వినోద్ ఇంటి బయట ఉన్న మంచంపై రిషిబాబు విగతజీవిగా పడి ఉన్నాడన్న సమాచారంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు ఉండటం చూసి తట్టుకోలేకపోయిన బంధువులు, ఇది తండ్రి చేసిన హత్యేనని ఆరోపిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లుడే తన మనవడిని దారుణంగా హతమార్చాడని తాత రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానంతో కన్నప్రేమను మరిచి ఓ చిన్నారి ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని పెదపాడు పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us