Devaragattu Bunni festival 2021: క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం శుక్రవారం అర్థరాత్రి ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగినట్లే.. ఈ ఏడాది కూడా హింస చోటుచేసుకుంది. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రలో తాజాగా చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు కొండ మీద ఉన్న మాళ మాల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణం అనంతరం దసరా జైత్రయాత్ర ప్రారంభమైంది. స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు. ఏటా మాదిరిగానే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో హింస చెలరేగింది. ఎప్పటిలానే బన్నీ ఉత్సవంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారన్న సంగతి తెలిసిందే. అయితే.. హింసను ఈసారి నిరోధించేందుకు పోలీసులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ.. ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి. అయితే.. ఇప్పటికీ.. ఈ ఉత్సవంపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్ళెదుటే హింస జరుగుతుంటే , పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించాయి. అయినప్పటికీ దేవరగట్టులో హింస జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: