US Assistance: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో భారత్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడికి భారత్ చేపట్టిన లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటివి చేపట్టడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా మరోసారి అండగా నిలిచింది. భవిష్యత్ ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌కు 41 మిలియన్ అమెరికన్ డాలర్లను సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సాయంతో కలిపి ఇప్పటి వరకు అమెరికా భారత్‌కు అందించిన సాయం 200 మిలియన్ డాలర్లు దాటుతుందని అమెరికా పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు రూ.3 లక్షలకుపైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆక్సిజన్ సహా ఆస్పత్రుల్లో బెడ్స్, ఇతర ఆరోగ్య పరికరాల కొరతతో భారత్ తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
అయితే అగ్రరాజ్యం అమెరికా అపదలో ఉన్న సమయంలో ఆదుకున్న భారత్‌కు ఇప్పుడు అమెరికా అండగా నిలుస్తోందని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) తెలిపింది. భారత్‌లో కోవిడ్ పరీక్షలు, కరోనా సంబంధిత సమస్యలు, వైద్య సేవలు, మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కలప్నకు అమెరికా సాయం అందిస్తుందని యూఎస్‌ఏఐడీ పేర్కొంది. అదనపు నిధుల ద్వారా మెరుగైన వైద్య సేవలు, ఇతర వైద్య పరికరాల కొనుగోలు, వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలకు సాయం అందించనున్నట్లు వెల్లడించింది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా భారత్ అతలాకుతలమైంది. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌లో భారత్ తీవ్ర ఇబ్బందులకు గురైంది. కరోనా కేసుల కారణంగా దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను చవి చూసింది. గతంలో కూడా అమెరికా భారత్‌కు అండగా నిలిచింది. కోవిడ్‌తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి తన సహాయాన్ని ప్రకటించింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం దేశంల కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.