అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. యూఎస్ దిగువ సభలో ట్రంప్‌పై అభిశంసనకు ఓటింగ్ జరిగింది. దిగువ సభలో 230 ఓట్లు ఇందుకు అనుకూలంగా పడగా.. 197 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. అభిశంసనను ఎదుర్కుంటున్న మూడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావడం విశేషం. అయితే సెనేట్‌లో ఆయనకు ఎదురుగాలి వీయకపోవచ్చు. ఆ సభలో రిపబ్లికన్లదే మెజార్టీ. దిగువ సభ చైర్ పర్సన్ పెలోసీ ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. జో బిడెన్‌పై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షునిపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలతో అభిశంసనకు గురయ్యారు ట్రంప్.దీంతో అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా నిలిచారు అధ్యక్షుడు ట్రంప్. మరోవైపు, తనపై ప్రారంభించిన అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి ట్రంప్ 6 పేజీల ఘాటు లేఖ రాశారు. తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. నిరసన ప్రదర్శనలతో అమెరికా హోరెత్తిపోయింది. ట్రంప్‌పై అభిశంసన అభియోగాలపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు నిరసనలకు దిగారు అమెరికన్లు. డొనాల్డ్ అధ్యక్ష పదవికి అనర్హుడంటూ..వెంటనే ఆయన్ను తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్‌తో ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్‌కు అభిశంసన తప్పదని.. ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీల్లేదని నినాదాలు చేశారు.