సంచలనం రేపిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిపుణురాలు ఆగ్నస్ కాల్ మార్డ్ ఒక నివేదికలో వెల్లడించారు.
గత ఏడాది అక్టోబర్ 2న వాషింగ్టన్ పోస్ట్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నజమాల్ ఖషోగీ టర్కీలో దారుణంగా చంపబడ్డారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో ఖషోగీ హత్యకు గురయ్యారు. అయితే ఈ దారుణం వెనుక సౌదీ రాజ కుటుంబం ఉన్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఖషోగీ హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందని ఆగ్నస్ కాల్ మార్డ్ తన నివేదికలో బయటపెట్టారు. అయితే ఈ ఆరోపణలను మొదట్నుంచీ సౌదీ అరేబియా కొట్టిపారేస్తూనే ఉంది. ఆయనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో సౌదీ ఇంతటి దారుణానికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే తాజాగా ఆగ్నస్ తన నివేదికలో సౌదీ యువరాజు విషయంలో కొన్ని ఆరోపణలు చేసారు. జర్నలిస్ట్ ఖషోగీ హత్యకేసులో తన వద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయని, ఈ కేసులో యువరాజు బిన్ సల్మాన్ తోపాటు ఉన్నత స్ధాయి అధికారులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖషోగీకి యువరాజుకు సంబంధించిన అన్ని విషయాలు తెలియడంతో ఎప్పుడూ భయపడుతూ ఉండేవారని తన దర్యాప్తులో తేలినట్టుగా ఆగ్నస్ తన నివేదికలో వెల్లడించారు.