USA: ప్రపంచదేశాల విద్యార్థులపై ట్రంప్ ఇజం.. ఇమ్మిగ్రేషన్ అంశాలపై రోజుకో మతలబు
అమెరికా.. అమెరికా. అక్కడేదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టేసి.. ఎంచక్కా ప్లయిట్ ఎక్కేసి... వారానికి మూడు, నాలుగు గంటలు కాలేజీకి వెళుతూ... మిగతా టైం అంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసుకుంటూ... ఆ తర్వాత అక్కడే జాబ్ కొట్టి సెటిలైపోవచ్చు అనుకుంటున్నారా...! నో ఛాన్స్. అక్కడున్నది ఎవరిప్పుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి ప్రెసిడెంట్ సీటులో కూర్చున్నారో లేదో యమా దూకుడు చూపిస్తున్నారు. అమెరికా వచ్చేవారికి... వెళ్లేవారికి కండీషన్స్ అప్లై అంటున్నారు. ప్రపంచదేశాలకు షాకులిచ్చే పనిలో పడ్డారు...!

అమెరికాకు రండి… కానీ వచ్చిన పని చూసుకుని వెళ్లిపోండి. అక్రమంగా దేశంలో ఉండొద్దు. అమెరికాను, అమెరికన్ల అవకాశాలను దెబ్బతీయొద్దు. ఏరకంగా చూసినా ఇదీ రీసెంట్‌గా ట్రంప్ పాలసీ. ఆ దేశం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు సరైనవే కావచ్చేమోగానీ.. కానీ భారతీయులు సహా ప్రపంచ దేశాల్లోని అనేకమంది డాలర్ డ్రీమ్స్‌పై మాత్రం ట్రంప్ డెసిషన్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే అక్రమ వలసలను తిప్పిపంపుతున్న ట్రంప్ సర్కార్.. రేపోమాపో వీసాలపై కూడా ఏదో రకంగా ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
తాజాగా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీ నుంచి US హౌస్ కమిటీకి కొన్ని ప్రతిపాదనలు అందాయి. సాధారణంగా వలసవచ్చే విద్యార్థుల కోసం అమెరికా F1, M1 వీసాలను ఇస్తుంది. F1 అంటే అక్కడ ఫుల్ టైమ్ అకడమిక్ కోర్సుల్లో చేరేవాళ్ల కోసం. M1 అంటే నాన్ అకడమిక్ కోర్సుల కోసం వెళ్లేవాళ్ల కోసం. అయితే సహజంగా అలా వెళ్లే విద్యార్థులంతా అక్కడే చదువుకుని, జాబ్స్ చూసుకుని.. సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్లకే తాజా ప్రతిపాదనలు చెక్ పెట్టేలా ఉన్నాయి. ఆ ప్రతిపాదన ప్రకారం ఎవరైనా సరే.. చదువుకోడానికి వెళ్లేవాళ్లు చదువుకుని వెళ్లిపోవాలి. అసలు ఈ వీసా ఇచ్చే సమయంలోనే సదరు విద్యార్థి ఇంటెన్షన్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే చదువు పూర్తవ్వగానే తిరిగి స్వదేశానికి వెళ్లిపోతానని అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నట మాట. లేదంటే అమెరికా చట్టాలు వాటి పని అవి చేసుకుపోతాయి.
ఇక చాలామంది అమెరికా వెళ్లేది H1B వీసాలపైనే. అంటే అమెరికా సంస్థలు.. విదేశాల నుంచి మ్యాన్ పవర్‌ని తెప్పించుకుంటాయి. అక్కడ పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాయి. అలా వెళ్లిన వాళ్లు కూడా తర్వాత భాగస్వామిని, పిల్లల్ని డిపెండెంట్ వీసాపై అమెరికాకు రప్పించుకుని.. మెల్లిగా అక్కడే సెటిల్ అయిపోతారు. కొన్నాళ్లకు గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేస్తారు. ఇప్పుడు ఈ ప్రక్రియపైనా ప్రక్షాళన కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల్లోనూ స్క్రూటినీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజా ప్రతిపాదనల ప్రకారం.. H1B వీసా భారీ వేతనాలు ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలి. అది కూడా ఏడాదికి 75వేలకు మాత్రమే పర్మిట్ చేయాలి. పైగా.. H1B వీసాలకు పరిమితం కేవలం రెండేళ్లే ఉండాలి. మహా అయితే మరో రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. అంతేగానీ.. ఆటోమెటిక్ రెన్యువల్ దాకా అనుమతి ఇచ్చి, గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేసుకునేంత స్థాయిలో H1B వీసాను ఒప్పుకోకూడదన్న ప్రతిపాదనలు ట్రంప్ ప్రభుత్వం ముందున్నాయి.
మొత్తంగా… ట్రంప్ ముందున్న ప్రతిపాదనలన్నీ అమలైతే అమెరికా పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందోగానీ.. ప్రస్తుతానికి మాత్రం మనవాళ్లకు గడ్డుకాలమే… అమెరికా వెళ్లాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్లకు కష్టకాలమే. మరి చూడాలి ట్రంప్ ఏం చేస్తారో…! మున్ముందు ఎలాంటి షాకులిస్తారో…!