
ఇటీవల వరుస విమాన ప్రమాద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ వరుస సంఘటనల పట్ల విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రోజు ఏదో ఒక చోట విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అర్థాంతరంగా ల్యాండ్ అవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక గాల్లో పక్షులు ఢీకొనే సంఘటనలు సైతం ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎదురుగా వచ్చింది పక్షి అయితే పర్వాలేదనుకోవచ్చు. కానీ అది యుద్ధ విమానం. యస్.. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల మిన్నియాపొలిస్ నుంచి మైనట్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి, బీ 52 బాంబర్ యుద్ధ విమానం ఎదురుగా దూసుకు వచ్చింది.
అయితే యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డెల్టా విమాన పైలట్ తెలిపారు. దీంతో ఆ సమయంలో ప్రమాదాన్ని తప్పించడానికి విమానాన్ని వేగంగా మరోవైపునకు మళ్లించినట్లు పేర్కొన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పి వారిని క్షమాపణలు కోరామని పైల్ వివరించారు.
ప్రమాదం గురించి పైలట్ అనౌన్స్‌మెంట్ చేస్తున్న సమయంలో ఆడియో రికార్డు చేసిన ఓ ప్రయాణికురాలు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. యుద్ధ విమానం ఒక్కసారిగా తమవైపు దూసుకురావడంతో విమానాన్ని వేగంగా మరోవైపు తిప్పినట్లు తెలిపారు. యుద్ధ విమానం గురించి సమాచారం ఇవ్వకపోవడం, రాడార్ వ్యవస్థ నుంచి సిగ్నల్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అతడు వివరిస్తున్నట్లు ఆడియోలో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.