Blood Sugar Levels: ప్రస్తుత కాలంలో డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక డయాబెటిస్ బారిన పడిన వారు కనీసం మూడు నెలలకోసారైనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షుగర్ లెవల్స్ పెరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు బ్లడ్ షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు మన శరీరం నుంచి కొంత రక్తం తీయాల్సి వచ్చేది. రక్తం తీయాలంటే సూది గుచ్చడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృద్ధులకైతే మరీ తలనొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా పరిశోధకులు తయారుచేసిన డివైజ్‌తో ఎలాంటి రక్తం తీయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మన శరీరంపై వచ్చే చెమట ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించవచ్చంటున్నారు. ఈ పరికరాన్ని చేతిపై ధరించడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ను గుర్తించవచ్చు అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ‘బయోసెన్సర్స్’ బయోఎలక్ట్రానిక్స్’ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ డివైజ్‌లో నికెల్ మెటల్‌ను ఉపయోగించారు. ఇది రక్తంలో చక్కెరకు సున్నితంగా ఉంటుంది. ఈ డివైజ్ తయారీలో బంగారం కూడా వినియోగించారు. దీని కారణంగా ఎవరికైనా అలెర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని చెబుతున్నారు పరిశోధకులు. ఈ డివైజ్ రక్తంతో పోలిస్తే చెమటలోని గ్లూకోజ్ 100 రెట్లు ఎక్కువగా గుర్తించడంలో పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్న పరికరాలు నిర్దిష్ట ఎంజైమ్‌లతో ఆల్కలీన్ ద్రవాలను ఉపయోగించడం వలన చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పరిశోధనలో తెలిపారు. ఈ డివైజ్‌లో ఎలాంటి ఎంజైమ్‌లు ఉపయోగించలేనందున చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.