First cases of monkeypox in children detected in US: ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోన్న మంకీపాక్స్ కేసులు అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారులకు తొలిసారిగా మంకీపాక్స్ సోకినట్లు అరోగ్య అధికారులు శుక్రవారం (జులై 23) మీడియాకు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదికల ప్రకారం.. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు కాలిఫోర్నియాకు చెందిన నివాసికాగా, మరొకరు అమెరికా స్వస్థలం కాని చిన్నారిగా గుర్తించారు. ప్రస్తుతం వ్యాధి సోకిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరికి మంకీపాక్స్ ఏ విధంగా సోకిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసిన మంకీపాక్స్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించింది. ఈ ఏడాది దాదాపు14,000లకు పైగా కేసులు వివిధ దేశాల్లో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు ఈ వ్యాధితో మరణించారు. యుఎస్, యూరప్ దేశాల్లో.. పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషుల్లో (homosexual) ఎక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. ఐతే ప్రస్తుతం ఈ అంటువ్యాధి ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని హెల్త్ ఆఫీషియల్స్ హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో 17 అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్లో 6 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇక గత వారం నెదర్లాండ్స్‌లో ఓ బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా.. అది ఏవిధంగా సోకిందనేది వైద్యులు ధృవీకరించలేమన్నారు. ఈ వ్యాధి తాలూకు తీవ్రత, మరణాలు చిన్న పిల్లల్లోనే అధికంగా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
చిన్న తనంలో మసూచీ టీకా వేయించుకోవడం వల్ల వృద్ధులు ఈ వ్యాధి బారీన పడటంలేదని నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌కి చెందిన డాక్టర్ జేమ్స్ లాలెర్ పేర్కొన్నారు. ‘మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించడంతో టీకాల నిలిపివేత జరిగి ఇప్పటికి దాదాపు 40 యేళ్లవుతుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇదే కోవకు చెందిన వ్యాధి మంకీపాక్స్ రూపంలో బయపడింది. టీకాల నిలిపివేత కారణంగా ప్రస్తుతం పిల్లల్లో మంకీపాక్స్ వైరస్ నుంచి రక్షణ కల్పించే రక్షణ కవచం కొరవడినట్లు’ డాక్టర్ జేమ్స్ లాలెర్ అభిప్రాయపడ్డారు. మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 3 కేసులు బయట పడిన విషయం తెలిసిందే.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి.