అమెరికా ఆర్థిక యుద్ధంలో చేరితే శత్రువులే.. ప్రపంచ దేశాలకు ఇరాన్‌ వార్నింగ్..!

అమెరికా ఆర్థిక ఆంక్షల కార్యక్రమంలో ఏ దేశమైనా భాగస్వామి అయితే తమ దృష్టిలో ఆ దేశం శత్రువేనని ఇరాన్ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. తమపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తే అమెరికా చమురు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు హోర్ముజ్ జలసంధి, ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

అమెరికా ఆర్థిక యుద్ధంలో చేరితే శత్రువులే.. ప్రపంచ దేశాలకు ఇరాన్‌ వార్నింగ్..!
Iran Us Economic War

Updated on: Aug 23, 2026 | 9:44 AM

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న ఆర్థిక ఒత్తిడి, ఆంక్షల కార్యక్రమంలో ఏ దేశమైనా భాగస్వామి అయితే.. తమ దృష్టిలో ఆ దేశం శత్రువేనని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహ్సెన్‌ రెజాయీ శనివారం (ఆగస్టు 22)ప్రభుత్వ టెలివిజన్‌లో ఈ హెచ్చరికలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను ఒంటరిచేసేందుకు కొత్తగా భారీ ఆంక్షల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇరాన్‌తో వాణిజ్యం, చమురు, ఆర్థిక లావాదేవీలు కొనసాగించే దేశాలపై కూడా ఒత్తిడి తీసుకురావాలని వాషింగ్టన్‌ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న చైనాను కూడా ఈ చర్యల్లో భాగస్వామ్యం చేయాలని అమెరికా కోరుతోంది. అయితే అమెరికా ఆంక్షలు సమస్యను పరిష్కరించవని చైనా ఇప్పటికే అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో మొహ్సెన్‌ రెజాయీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక యుద్ధంలో చేరవద్దని అన్ని దేశాలకు సూచించారు. తమపై ఆర్థిక ఆంక్షలు విధించడంలో సహకరిస్తే ఆ దేశాలను శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. అమెరికా నుంచి దూరంగా ఉండేందుకు నిరాకరిస్తే ఆయా దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు.

అంతేకాదు.. ఇప్పటివరకు తాము అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, అమెరికా ఆర్థిక ప్రయోజనాలపై దాడులు చేయలేదని రెజాయీ పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తే అమెరికాకు చెందిన చమురు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రంప్‌ మరింత చర్యలకు దిగితే తమ ప్రతిస్పందన భూకంపంలా’ ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆగస్టు 18వ తేదీన ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేసింది. ఈ నిర్ణయం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకున్నట్లు యూఏఈ తెలిపింది.

మరోవైపు హోర్ముజ్‌ జలసంధి విషయంలోనూ ఇరాన్‌ కఠిన వైఖరి కొనసాగిస్తోంది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఒత్తిడి మరింత పెరిగితే చమురు రవాణాపై ప్రభావం చూపే చర్యలకు దిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. దీంతో అమెరికా-ఇరాన్‌ ఘర్షణ కేవలం సైనిక అంశానికే పరిమితం కాకుండా, వాణిజ్యం, చమురు సరఫరా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us