మయన్మార్‌లో సైన్యం మారణహోమం… కాల్పుల్లో 38మంది పౌరులు చనిపోయినట్లు ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి

|

Mar 04, 2021 | 10:48 PM

మయన్మార్‌ నెత్తురోడింది. పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులపై మారణహోమం కొనసాగిస్తోంది.

మయన్మార్‌లో సైన్యం మారణహోమం... కాల్పుల్లో 38మంది పౌరులు చనిపోయినట్లు ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి
Follow us on

Myanmar coup opposition : మయన్మార్‌ నెత్తురోడింది. పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులపై మారణహోమం కొనసాగిస్తోంది. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది, కవరేజీలో ఉన్న విలేకరులపైనా దాడి చేస్తోంది. మయన్మార్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో 38 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ప్రకటించారు. ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం ప్రజలంతా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిపై సైన్యం, పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు.

సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, అంగ్ సాన్ సూకీని విడుదల చేయాలంటూ భారీ ఎత్తున నిరసనలు చేస్తున్న ప్రజలపై మయన్మార్ సైనికులు, పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఆందోళనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 38 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని యూనైటెడ్ నేషన్స్ ప్రత్యేక రాయబారి క్రిస్టిన్ ష్రానర్ బర్గెనర్ తెలిపారు. నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో సైన్యం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే టియర్ గ్యాస్ ప్రయోగిస్తోంది. దీంతో వందల మంది గాయాల పాలయ్యారు. కొంతమంది చూపు పోగొట్టుకున్నారు. పోలీసుల కాల్పుల్లో 14 ఏళ్ల టీనేజర్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం మహిళలు కూడా లక్షల సంఖ్యలో రోడ్ల మీదకు వస్తున్నారు. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగూన్‌లో జరిగిన ప్రదర్శనల్లో రక్తం చిందింది. నైపిడా, మాండలే, రంగూన్‌లో పోలీసులు, సైనిక బలగాలను భారీగా మోహరించారు. ఆందోళనలు చేస్తున్న వారిపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, గ్రైనైడ్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపారు. సైన్యం, పోలీసులు ఎంత ప్రతిఘటించినా నిరసనల నుంచి వెనక్కి తగ్గబోమని మయన్మార్‌ ప్రజలు చెబుతున్నారు.

ఇదిలావుంటే, నవంబర్‌ ఎన్నికల ఫలితాలను సైన్యం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సూకీ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె పార్టీ మరోసారి ఎన్నికల్లో గెలవడంతో ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధించింది. ఆమెపై పలు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసింది. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని మానవహక్కు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరోవైపు ముగ్గురు మయన్మార్ పోలీసులు పారిపోయి మిజోరం మిలిటరీ శరణాలయం చేరుకున్నారని అధికారులు తెలిపారు. ముగ్గురు మయన్మార్ పోలీసు అధికారులు భారతదేశంలోకి ప్రవేశించారు మరియు మిజోరాంలో ఆశ్రయం పొందారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. పోరస్ సరిహద్దు దాటిన ముగ్గురు పోలీసులను మిజోరాం లోని సెర్చిప్ జిల్లాలోని లుంగ్కావ్ సమీపంలో ఆశ్రయం పొందారని మిజోరాం హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read Also…  కరోనా నేపథ్యంలో కేంద్ర కొత్త మార్గదర్శకాలు… షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లపై ఆంక్షలు..