
రష్యాను ఉక్రెయిన్ డ్రోన్ల భయం వెంటాడుతోందా?.. ఆ భయంతోనే ప్రతిష్ఠాత్మకమైన నేవీ పరేడ్‌ను రష్యా రద్దు చేసుకుందా?.. అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఉక్రెయిన్ ఎంత పిల్లపిశాచి.. నలిపేస్తాం.. ఉఫ్‌మని ఊదేస్తాం.. రెండు రోజుల్లో కాళ్లబేరానికి తెచ్చుకుంటాం అంటూ మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై బాంబులు కురిపించింది రష్యా. రష్యా బలం బలగం ముందు ఉక్రెయిన్ ఎంత పాటి అనుకున్నాయి ప్రపంచదేశాలు కూడా. రష్యా అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్‌ను మించిన మొండిఘటంలా ఉన్నారు. మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు రివర్స్ అయింది. పిల్ల అనుకున్న ఉక్రెయిన్ పులిగా మారి గర్జిస్తోంది. నాటో సహకారంతో కొంతకాలంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటీవల ఆపరేషన్ ‘స్పైడర్ వెబ్’తో మాస్కోను హడలెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. కీవ్ డ్రోన్ దాడుల భయంతో రష్యా తన యుద్ధనౌకల పరేడ్‌లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ వెల్లడించారు.
రష్యా గత నాలుగు రోజులుగా దాదాపు 150 యుద్ధనౌకలతో విన్యాసాలు నిర్వహించింది. నేవీ డే వార్షిక వేడుకలు పురస్కరించుకుని సెయింట్ పీటర్స్‌బర్గ్, కాలినిన్‌గ్రాడ్, వ్లాదివొస్తొక్‌లలో రెండు రోజులపాటు యుద్ధనౌకల పరేడ్ నిర్వహించాల్సింది. అయితే.. భద్రతాపరమైన కారణాలతో అధికారులు వీటిని రద్దు చేశారు. దేశాధినేత పుతిన్ ఇప్పటికే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పర్యటిస్తున్నారు. నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన ఆయన.. నౌకాదళ విన్యాసాల గురించి ఆరా తీశారు. మరిన్ని యుద్ధనౌకలు నిర్మిస్తామని, నేవీ శిక్షణను ముమ్మరం చేస్తామని.. తద్వారా పోరాట సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. మరోవైపు.. ఉక్రెయిన్ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో మరిన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. డ్రోన్ల ముప్పుతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రయం తెల్లవారుజామున పదుల కొద్ది విమానాలను నిలిపివేసింది.
ఇదిలావుంటే… యుద్ధం మొదట్లో నల్ల సముద్రంలో మోహరించిన పలు రష్యన్ యుద్ధనౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది.దాంతో.. క్రిమియాలోని తన నౌకాదళ ఫ్లీట్‌ను రష్యా నోవోరోసిస్క్‌కు తరలించింది. నేవీ పరేడ్ రద్దు నేపథ్యంలో రష్యా నేవీ బృందాన్ని ప్రశంసిస్తూ ఓ ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు వ్లాదిమిర్ పుతిన్. 2022 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల యుద్ధం కొనసాగిస్తోంది. కానీ.. ఇటీవల రష్యాపై అనూహ్య రీతిలో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది.