ఫ్లైయింగ్ సాసర్.. గతకొద్ది రోజులుగా ఈ పేరు మరుగునపడింది.. ఇప్పుడు తాజాగా మరోమారు హల్‌చల్ చేస్తోంది. ఆకాశంలో పెద్ద ప్లైయింగ్ సాసర్ ఆకారం కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. టర్కీలో ఆకాశంలో ఓ వింత మేఘం కనువిందు చేసింది. టర్కీలోని బుర్సాలో విచిత్ర ఫ్లైయింగ్ సాసర్… స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. UFO ఆకారంలో, గులాబీ రంగులో ఆ మేఘం కనిపించింది. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయాందోళనకు లోనయ్యారు. కొందరు స్థానికులు ఆ మేఘాన్ని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అచ్చం UFO మాదిరిగానే ఉందని కొందరు అంటుంటే, అచ్చం గులాబీ పువ్వులా ఉందంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.
ఈ భారీ మేఘం టర్కీలోని వివిధ నగరాల్లో కూడా కనిపించినట్లు సమాచారం. టర్కీలోని అనేక ప్రాంతాల్లో కనిపించిన ఈ వింత మేఘాన్ని చూసిన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ వీడియోను చూసి చాలా మంది భిన్న రకాలుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు దీనిని తేనెటీగ గొడుగుగా అభివర్ణించారు. కొందరు దీనిని UFO అని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వింత మేఘం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Turkey’s Bursa region witnessed an incredible cloud formation… pic.twitter.com/wOWnRTETHp
— Tansu YEĞEN (@TansuYegen) January 20, 2023
ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై తుర్కియే మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి మేఘాలు 2 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు. గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..