Tsunami Warning: హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు.. తూర్పు తైమూర్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం

|

May 27, 2022 | 1:43 PM

ఈస్ట్‌ తైమూర్‌ తీరంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అయితే..

Tsunami Warning: హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు.. తూర్పు తైమూర్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం
Tsunami Warning
Follow us on

తూర్పు తైమూర్ తీరంలో శుక్రవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. భూకంపం ప్రకంపనలు తైమూర్ ద్వీప తూర్పు వైపు నుంచి 51.4 కి.మీ లోతులో వచ్చాయని గుర్తించారు. ఈస్ట్‌ తైమూర్‌ తీరంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అయితే, ఈ విషయంలో జరిగిన నష్టంపై తక్షణ నివేదిక లేదు. భూకంపం కారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే సునామీకి కారణమయ్యే అవకాశం ఉందని సునామీ అడ్వైజరీ గ్రూప్ తెలిపింది. తూర్పు తైమూర్, ఇండోనేషియా మధ్య విభజించబడిన తైమూర్ ద్వీపం.. తూర్పు కొన నుంచి 51.4 కిమీ (32 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. హిందూ మహాసముద్రం సునామీ హెచ్చరిక, ఉపశమన వ్యవస్థ (IOTWMS) ఈ ప్రాంతానికి సునామీ హెచ్చరికను జారీ చేసింది.

తూర్పు తైమూర్‌లో భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక

తూర్పు తైమూర్, ఇండోనేషియా పసిఫిక్ మహాసముద్రంలోని చాలా సున్నితమైన “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలోకి వస్తాయి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉంటుంది. తీవ్రమైన భూకంప కార్యకలాపాల వచ్చే ప్రాంతంగా గుర్తించారు. ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో డజను మంది చనిపోయారు.

తైమూర్ జనాభా ఎంత?

సుమత్రా తీరంలో 2004లో వచ్చిన 9.1 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీని ప్రేరేపించింది. ఈ సమయంలో  మొత్తం ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల మంది మరణించారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు చాలా మంది ప్రభావితమయ్యారు. తూర్పు తైమూర్ సుమారు 1.3 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఇక్కడి జనాభాలో 42 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.