
అమెరికా, నార్త్ కొరియా మధ్య ఇన్నాళ్లూ పచ్ఛగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండేది.. ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ వచ్ఛేవారు. ఒక దశలో రెండు దేశాల మధ్య వార్ సూచనలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్రంప్, కిమ్ ఇద్దరూ స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నారు. ట్రంప్.. తమ దేశాలను వేరు చేస్తున్న నార్త్, సౌత్ కొరియన్ టెరిటరీ కాంక్రీటు బ్లాకులను దాటుకుని కిమ్ ని కలుసుకున్నారు. అందులోనూ డీమిలిటరైజ్డ్ జోన్ లో వీళ్ళిద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని నడుచుకుంటూ కెమెరాలకు పోజులిచ్చారు. ఇదొక చరిత్రాత్మక పరిణామం. అమెరికా అధ్యక్షుడు నార్త్ కొరియాను విజిట్ చేయడం ఇదే మొదటిసారి. కిమ్ తో చేతులు కలిపిన ట్రంప్.. ఈ నిస్సైనికీకరణ రేఖ వద్ద తాను ఉండడం గర్వకారణమని అన్నారు. వీరిద్దరితోను దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ భేటీ కావడం విశేషం. కాగా-ఇది ప్రపంచానికే గొప్ప దినమని, ఇక్కడికి రావడం తనకు గౌరవప్రదమే కాక.. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతున్నాయని ట్రంప్ చమత్కరించారు.
అమెరికా-ఉత్తర కొరియా మధ్య అణు ఒప్పంద అంశంలో ప్రతిష్ఠంభన నెలకొనడంతో దీని పరిష్కారానికి ట్రంప్ శనివారం నాడు.. కిమ్ కు ఆహ్వానం పంపుతూ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు. ‘ మేం ఇద్దరం చెయ్యీ..చెయ్యీ కలుపుకుంటాం.. వియత్నాం సమస్య అనంతరం మేము ఒకరినొకరం కలుసుకోనేలేదు ‘ అని ఆయన పేర్కొన్నారు. జీ-20 సమ్మిట్ సందర్భంగా జపాన్ లోని ఒసాకాలో ఉన్నప్పుడు ట్రంప్ ఈ మేరకు ట్వీటించారు. ఈ ట్వీట్ అందిన కొన్ని గంటల్లోనే నార్త్ కొరియా విదేశాంగ ఉప మంత్రి చోసన్-హూ ‘ ఇది మంచి సూచన ‘ అని అభివర్ణించారు. అటు-నార్త్ కొరియా-అమెరికా మధ్య సౌహార్ద, స్నేహపూరిత వాతావరణం ఏర్పడడం వల్ల ఈ ఖండంలో శాంతి నెలకొంటుందని దక్షిణ కొరియా అధినేత పేర్కొన్నారు. ఇక కిమ్ కూడా… ట్రంప్ రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోగలవని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.