మీ దేశానికి మా దేశం ఎంత దూరమో.. మా దేశానికి మీ దేశం కూడా అంతే దూరం. కెనడాకు ఈ విషయం అర్థం కానట్టుంది. భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇంకా దానికి తెలిసిరాలేదు. కేవలం సొంతగడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. మనపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. మన దేశంతో దౌత్యపరమైన సంబంధాలను పణంగా పెట్టారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ఏం లాభం? భారత్.. అంతర్జాతీయ పరిణామాలపై కాస్త జాగ్రత్తగా అడుగులేస్తుందని.. అందుకే తమకేమీ కాదులే అని కెనడా ప్రధాని ట్రూడో భావించినట్టుంది. ఇప్పుడు ఇండియా రియాక్షన్ చూసేసరికీ.. ట్రూడోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు.. ట్రూడో మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు మనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు? మన విషయంలో ట్రూడో ఎందుకు అంత ఓవర్ యాక్టివ్ గా ఉన్నారు? దీని వెనుక అసలు కథేంటి?
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడా ఓవర్ యాక్షన్ చేస్తోంది. మనపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక మన అధికారుల పాత్ర ఉందని.. కెనడా పార్లమెంటులో ప్రధాని ట్రూడో.. కిందటేడాది ఓ ప్రకటన చేశారు. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగింది. దాని గురించి పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏకంగా.. కెనడాలో మన హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు అక్కడి మన దౌత్యవేత్తలను నిజ్జర్ హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్నట్టు చెప్పింది.
సంజయ్ కుమార్ వర్మను పర్సన్స్ ఆఫ్ ఇంట్రస్ట్ గా కెనడా ప్రకటించింది. అంటే నిజ్జర్ కేసులో విచారిస్తామని చెప్పింది. మామూలుగా అయితే విదేశాల్లో పనిచేసే దౌత్య సిబ్బందికి దౌత్యపరమైన ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటివేమీ పట్టించుకోకుండా.. మన రాయబారి సంజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ను కూడా లెక్కచేయకుండా.. ఆయనపై ఆరోపణలు చేస్తూ.. విచారిస్తామని చెప్పడం వెనుక కారణమేంటి? అందుకే దీనిని మన దేశం చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ.. వెంటనే రియాక్ట్ అయ్యింది.
నిజ్జర్ హత్యకు సంబంధించి ఆధారాలు ఇవ్వండయ్యా అంటే.. అవేవీ ఇవ్వకుండా.. ఏకంగా మన హైకమిషనర్ ను, దౌత్యవేత్తలను ఎలా అనుమానితులుగా భావిస్తారంటూ.. ఇండియా ఫైరైంది. కెనడా ఏకంగా మన అధికారులనే అనుమానించడంతో.. ఆ దేశంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ట్రూడో సర్కార్.. మత ఛాందసవాదులకు లొంగిపోయిందని తీవ్రంగా విమర్శించింది. కెనడాలో ఉన్న మన హైకమిషనర్ తో పాటు దౌత్యసిబ్బందికి రక్షణ లేదని.. హత్యకేసులో మన హైకమిషనర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రం మండిపడింది. అందుకే వారిని వెనక్కు వచ్చేయమంది. అయినా కేంద్రం అక్కడితో ఆగలేదు. మన దేశంలో ఉన్న కెనడా రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ.. దీనిపై గట్టిగానే వివరణ అడిగింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు భారత్ విడిచిపెట్టాలని.. ఈనెల 19 లోగా కెనడాకు వెళ్లిపోవాలని చాలా స్ట్రాంగ్ గా తేల్చి చెప్పింది. దీంతో కెనడా షాకైంది.
అగ్గి వేసి.. దానిపై గుగ్గిలమేసి.. దానిని రాజేసి.. ఇప్పుడేమో అయ్యో అంటున్నారు కెనడా ప్రధాని ట్రూడో. రెండు దేశాల దౌత్య వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్యలు తనను షాక్ కు గురి చేశాయన్నారు. కెనడాలో ఉన్న సిక్కులతో పాటు భారతీయులు కూడా అసంతృప్తి చెందారన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కెనడా గౌరవిస్తుందని.. భారత్ కూడా తమను గౌరవించాలని చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నిజంగానే మన దేశానికి అంత విలువ ఇస్తే.. నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా మన హైకమిషనర్ తో పాటు దౌత్యవేత్తలను ఎలా అనుమానితులుగా చెబుతారు? ట్రూడో మీ దగ్గర దీనికి సమాధానముందా?
జరుగుతున్న పరిణామాలను చూస్తే.. ఖలిస్తాన్ నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కెనడా సహకరిస్తోందని అర్థం చేసుకోవాలా? ట్రూడో రెండు నాల్కల ధోరణి దేనికి సంకేతం? ఒకప్పుడు మనకు మిత్రదేశంగా ఉన్న కెనడా ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? ఆధారాలు చూపకుండా పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పిస్తోంది? భారత్ లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టినవారిని సపోర్ట్ చేస్తారా? ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నకీలక పార్టీ నాయకుడు కూడా ఖలిస్తాన్ వేర్పాటు వాదంతో లింకై ఉన్నారు. అందుకే ఆయన ఇలా చేయరని చెప్పలేం. సో.. తన ప్రభుత్వ మనుగడ కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత వ్యతిరేక వాదనను ట్రూడో తీసుకున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశంతో దౌత్యపరమైన బంధాలను పణంగా పెట్టారంటే.. కెనడా ప్రధాని ట్రూడో ఏ స్థాయిలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో క్లియర్ గా అర్థమవుతోంది.
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమ్మిట్ లో కూడా ప్రధాని మోదీతో జస్టిస్ ట్రూడో సమావేశమయ్యారు. మీటింగ్ తరువాత దాని గురించి వివరాలను ట్రూడో చెప్పలేదు. కెనడాలో పౌరుల రక్షణ, చట్టబద్ద పాలన బాధ్యత ఏ ప్రభుత్వంపై ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే.. ట్రూడో ఏ రూట్ లో వెళ్లాలనుకుంటున్నారు? అయినా కెనడా ప్రధానికి.. రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కెనడాలో టెర్రరిజం పెరిగితే.. దానివల్ల ఆ దేశానికి లాభమో, నష్టమో ట్రూడోకు తెలియదా? అసలు ఇది.. అక్కడి ప్రజలకు క్షేమమేనా? దేశ రక్షణతో పాటు ప్రజల సంరక్షణ గురించి ఆలోచించే పాలకులు.. ఇలాగే వ్యవహరిస్తారా? అయినా ఉగ్ర విష నాగులను పెంచి పోషించి మనపైకి ఉసిగొల్పే పాకిస్తాన్ కు ఏ గతి పట్టింది? దాని అనుభవాన్ని చూసిన కెనడా ప్రధానికి ఆ మాత్రం పరిస్థితి అర్థం కాదా? అయినా కెనడా.. ఎందుకు పదే పదే ఇండియాను టార్గెట్ చేస్తోంది?
ముజాహిదీన్, తాలిబన్, అల్ ఖైదాలను పెంచి పోషించిన దేశాలకు చివరకు ఎలాంటి గతి పట్టిందో కెనడా ప్రధానికి తెలియదా? తీవ్రవాదాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తే.. అది భస్మాసుర హస్తం అవుతుందని కెనడా ప్రధాని ట్రూడోకు ఇంకా అర్థం కాలేదా? అందుకే మిగిలిన దేశాలు ఇప్పుడు కెనడా విషయంలో క్లియర్ కట్ స్టాండ్ తీసుకోవాల్సి ఉంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించవద్దు అని నచ్చజెప్పాలి. లేదంటే ఉగ్రనాగు ఎవరినైనా కాటేస్తుంది అని మర్చిపోకూడదు.
నిజానికి కెనడాకు మన దేశంతో మంచి సంబంధాలే ఉండేవి. మన దేశంతో వ్యాపార సంబంధాల్లో కెనడా పదో స్థానంలో ఉంది. కానీ ఈమధ్యకాలంలో ఇవి బెడిసికొట్టాయి. నిజ్జర్ ను అప్పగించాలని అప్పట్లో మన దేశం కోరినా కెనడా సరిగా స్పందించలేదు. పైగా జీ20 సమావేశాల్లో కూడా ట్రూడో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. మరి దీనిని మనం ఏమని అర్థం చేసుకోవాలి? కెనడాలో సిక్కు కమ్యూనిటీ చాలా బలమైంది. దాదాపు 8 లక్షల మంది సిక్కుల జనాభా ఉంది. మొత్తం కెనడా జనాభాలో వీరి వాటా 2 శాతం ఉంటుంది. టోటల్ గా చూస్తే.. కెనడాలో 16 లక్షల మంది భారతీయులు ఉంటారు. ప్రస్తుత పరిణామాలు అక్కడి భారతీయులకు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ పరిస్థితులు సద్దుమణిగితే అన్నీ సర్దుకుంటాయి అంటున్నారు నిపుణులు.
ట్రూడో మీరు మీ దేశంలో పొలిటికల్ లూడో ఆడుకుంటానంటే నో ప్రాబ్లమ్. కానీ భారత్ తో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటే.. అదే స్టాండ్ పై ఉండాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి పస లేని, పనికిరాని, ఆధారాల్లేని స్టేట్ మెంట్లు ఇస్తే.. మీ యాక్షన్ కు.. ఇండియా నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి