రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ మహిళా పైలట్ చూపించిన ధైర్యసాహసాల పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. గుజరాత్ కచ్(Katch) లోని తుంబ్డి ప్రాంతానికి చెందిన దిశా గదా.. ఎయిర్ ఇండియాలో(Air India) పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు ఆమె ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం(Russia-Ukraine Battle) జరుగుతున్నా విద్యార్థులే భద్రతే ముఖ్యమని భావించి, ఆ దేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో నలుగురు సీనియర్ సిబ్బందితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఉక్రెయిన్ కు బయల్దేరారు. నల్లసముద్రం మీదుగా కీవ్‌లోని బోరిస్‌పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్న 242 మంది వైద్య విద్యార్థులను ఎక్కించుకుని, ముంబయి కి తీసుకువచ్చారు. ఎయిర్ ఇండియా విమానాన్ని ఉక్రెయిన్‌లో ల్యాండ్ చేసే సమయంలోనే యుద్ధం ప్రారంభమైందని పైలట్ దిశ అన్నారు.
యుద్ధ సన్నివేశాలు సవాల్ విసిరినప్పటికీ.. సీనియర్ల మార్గదర్శకత్వంలో విమానాన్ని ఉక్రెయిన్ లో భద్రంగా ల్యాండ్ చేయగలిగామని ఆమె వెల్లడించారు. ఫలితంగా విద్యార్థులను ఇక్కడికి తీసుకురాగలిగామని అన్నారు. తాము చేసిన సహాయం కష్టతరమైనప్పటికీ.. మన దేశ విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోలేక తప్పదని పైలట్ దిశ హర్షం వ్యక్తం చేశారు. పైలట్ దిశ.. తన భర్త ఆదిత్య మన్నూర్ తో కలిసి ముంబయి లో నివాసముంటున్నారు. దిశా కచ్ వాసి కావడంతో కచ్ వాసులు గర్వంతో ఉప్పొంగుతున్నారు.
ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది భారతీయ పౌరులు చిక్కుకున్నారు. వారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. వారికి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. భారతీయుల సురక్షిత ప్రయాణం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయని అనుమానిస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 15న ఉక్రెయిన్‌ను ఖాళీ చేయమని భారతీయులకు సలహా ఇచ్చింది. దాదాపు 2000 మంది భారతీయులు సలహాను అనుసరించి భారతదేశానికి తిరిగి వచ్చారు. మిగితా వారు ఉక్రెయిన్ ప్రభుత్వ హామీలను నమ్మి, అక్కడే ఉండిపోయారు. భారత పౌరులకు సలహాలు జారీ చేసేందుకు భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ కాంటాక్ట్ నంబర్‌లు, మెయిల్ ఐడీలు ఏర్పాటు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి మోడీ ప్రభుత్వం “ఆపరేషన్ గంగ” ప్రాజెక్టును చేపట్టింది.
ఇవీ చదవండి