Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి పయనమైన శుభాంశు.. ల్యాండింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..?

అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి పయనమయ్యారు. 18రోజుల పాటు శుక్లా ఐఎస్ఎస్‌లో ఉన్నారు. వివిధ ప్రయోగాలు చేపట్టారు. యాత్ర ముగియడంతో డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమికి వస్తున్నారు. 22గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ భూమిని చేరుకుంటుంది. ఇక ఐఎస్ఎస్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో శుభాంశు కీలక వ్యాఖ్యలు చేశారు.

Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి పయనమైన శుభాంశు.. ల్యాండింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..?
Shubanshu Shukla

Updated on: Jul 14, 2025 | 6:14 PM

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరికొన్ని గంటల్లో భూమిని చేరుకోనున్నారు. 18 రోజుల పాటు శుక్లా అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. అక్కడ వివిధ ప్రయోగాలు చేపట్టారు. యాత్ర ముగియడంతో డ్రాగన్ వ్యోమనౌకలో వారు భూమికి తిరుగు పయనమయ్యారు. 22 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ భూమిని చేరుకుంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా సముద్ర తీరంలోని సముద్రంలో ల్యాండ్ అవుతుంది. దీనికి సంబంధించి డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు మరో ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి ఐఎస్ఎస్‌కు వెళ్లారు. జూన్ 25న అక్కడి వెళ్లిన ఈ బృందం అక్కడ ఎన్నో ప్రయోగాలు చేపట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్షలోకి అడుగుపెట్టిన భారత రెండో వ్యోమగామిగా శుక్లా నిలిచారు. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 7 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్నారు. ఆయనే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు.

భూమికి తిరిగి రానున్న నేపథ్యంలో ఐఎస్ఎస్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ భారత్ అన్నీ దేశాల కంటే మిన్నగా కనిపిస్తోందంటూ.. సారే జహాసే అచ్ఛా అనే రాకేశ్ శర్మ మాటలను గుర్తు చేశారు. అంతరిక్షంలోకి రావడం ఒక మాయగా అనిపిస్తోందని.. ఇది ఒక అద్భుత ప్రయాణమని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని.. వాటన్నింటిని దేశ ప్రజలతో పంచుకుంటానని తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయడం గొప్పగా అనిపిస్తుందని చెప్పారు.

ఐఎస్ఎస్‌లో శుక్లా ఏడు నిర్దిష్ట మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించారు. ఇది అంతరిక్ష శాస్త్ర సాంకేతికతలో దేశ సామర్థ్యాన్ని చాటుతోంది. ఈ ప్రయోగాలు భవిష్యత్ మిషన్లు, దీర్ఘకాలిక అంతరిక్ష నివాసం కోసం కీలకమైన డేటాను రూపొందించడానికి సహాయపడనుంది. ఇస్రో గగన్‌యాన్ మిషన్, మానవ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక ముందు అడుగుగా చెప్పొచ్చు.