కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ఒకవైపు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా నినదిస్తుండగా… మరోవైపు తాజాగా అగ్రరాజ్యం అమెరికా వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపట్టిన చర్యలకు బైడెన్ ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపింది. అంతే కాకుండా శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమే అని, అయితే చర్చలతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్‌కు అమెరికా సూచించింది. భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని అన్నారు. వ్యవసాయ రంగంలో భారత తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్ పరిధి పెరుగుతుందని తెలిపారు.
అమెరికాలోని పలువురు చట్టసభ్యులు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. ప్రజాస్వామ్య దేశంలో రైతులకు కనీస హక్కులు కల్పించాలని కోరారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్న రైతులపై జరుగుతున్న చర్యలు ఆందోళనకరమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, రైతు సంఘాలు ఫలప్రద చర్చలు జరపాలని కాంగ్రెస్ సభ్యురాలు హేలీ స్టీవెన్స్ అన్నారు. మరో సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ స్పందిస్తూ.. ఆందోళన చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలని, వారికి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనపై కొందరు అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయొద్దని అంతర్జాతీయ సెలబ్రిటీలను ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. దేశంలోని చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే సాగుచట్టాలపై అభ్యంతరాలున్నాయని భారత విదేశాంగశాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read: