PM Narendra Modi – Sajith Premadasa: శ్రీలంకలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో పాలకవర్గం రాజీనామా చేయాలంటూ ప్రజలు తిరగబడుతున్నారు. ఎమర్జెన్సీ ఆంక్షలను ధిక్కరిస్తూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స(Gotabaya Rajapaksa) మినహా శ్రీలంక కేబినెట్ మంత్రులందరూ ఆదివారం అర్థరాత్రి రాజీనామా చేశారు. మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారని విద్యాశాఖ మంత్రి దినేష్ గుణవర్ధనే మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రపతి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రులందరూ తమ రాజీనామా లేఖలను సమర్పించామన్నారు. అయితే.. దేశంలో నానాటికీ దిగజారుతున్న పరిస్థితుల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ఆయన సోదరుడు మహింద రాజపక్స ప్రభుత్వ భవిష్యత్తుపై సోమవారం సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేను తొలగించినట్లు అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలను ఐక్య ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానించిన కొన్ని గంటల తర్వాత శ్రీలంకలో కొత్త మంత్రులను సైతం నియమించారు. కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ, విద్యా మంత్రిగా దినేష్ గుణవర్దన, హైవేస్ పోర్ట్‌ఫోలియో జాన్‌స్టన్ ఫెర్నాండోకు వెళ్లగా, ప్రొఫెసర్ జిఎల్ పీరిస్ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
కాగా.. సంక్షోభం ముదురుతున్న సమయంలో తమ దేశానికి సహాయం చేయాలని శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దయచేసి శ్రీలంకకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి అంటూ ఆయన ప్రాథేయపడ్డారు. ఇది మా మాతృభూమి, మా మాతృభూమిని రక్షించడానికి ఆదుకోండి అంటూ ప్రేమదాస భారత ప్రధానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్యాబినెట్‌లో చేరాలని మరియు మంత్రి పదవులను అంగీకరించాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్స అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (CBSL) గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ తన రాజీనామాను సమర్పించారు. క్యాబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కబ్రాల్ ట్వీట్ చేశారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఇంధన, ఆహార కొరత ఏర్పడింది. కొలంబోలోని పెట్రోల్ బంకులు, షాపుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. శ్రీలంక స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 5.9 శాతం పతనం తర్వాత ట్రేడింగ్ నిలిచిపోయింది. శ్రీలంకలో విధించిన 36 గంటల సుదీర్ఘ కర్ఫ్యూ ఈరోజు సోమవారం ఉదయం 6 గంటలకు ఎత్తివేయనున్నారు. అయినప్పటికీ, దేశంలో అత్యవసర పరిస్థితి యథావిధిగా ఉండనుంది. ఈ క్రమంలో శ్రీలంక ప్రజలు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
శ్రీలంకలో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై మాజీ, తాజా క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర, భానుక రాజపక్స, వనిందు హసరంగాతో సహా అనేక మంది ఆందోళనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ అజెండాలను పక్కనపెట్టి అందరూ ఐకమత్యంతో ముందుకుసాగాలని.. భవిష్యత్తును రక్షించుకోవాలంటూ పేర్కొంటున్నారు.
Also Read: