
స్పెయిన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంతో ప్రయాణించే రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో కనీసం 20 మంది మరణించగా, 73 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన ఒక రైలు పక్కనే ఉన్న ట్రాక్‌పైకి దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళ మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు, కార్డోబా ప్రావిన్స్‌లోని ఆడముజ్ సమీపంలో అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అదే సమయంలో మాడ్రిడ్ నుంచి హుయెల్వా నగరం వైపు వెళ్తున్న మరో రైలును ఇది బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రైళ్ల వేగం ఎక్కువగా ఉండటంతో ఘర్షణ తీవ్రత భారీగా ఉంది. ఒక రైలుకు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా, అందులో ఒక బోగీ ఏకంగా నాలుగు మీటర్ల లోతున్న వాలులోకి పడిపోయింది. అండలూసియా ప్రాంతీయ ఆరోగ్య మంత్రి ఆంటోనియో సాన్జ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. “ప్రస్తుతానికి 20 మృతదేహాలను వెలికితీశాం, కానీ శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నాం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన 73 మందిని ఆరు వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా మారుమూల కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. అయినప్పటికీ..స్పానిష్ సైనిక అత్యవసర విభాగాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక ప్రజలు మానవత్వాన్ని చాటుకుంటూ బాధితుల కోసం దుప్పట్లు, ఆహారం, నీటిని తరలించారు. రెడ్ క్రాస్ సంస్థ ఆరోగ్య అధికారులతో కలిసి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తోంది.
ఈ ఘోర ప్రమాదంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ కష్టసమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని ఆమె స్పానిష్ భాషలో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియా మధ్య రైలు సర్వీసులను ADIF పూర్తిగా నిలిపివేసింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ఈరోజు రైళ్లు నడిచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
WATCH 🔴
SPAIN: This is the condition of an Iryo high speed train after it derailed in Adamuz, with a separate AVE train also affected.
Multiple casualties reported. pic.twitter.com/oknyYd6pcl
— Open Source Intel (@Osint613) January 18, 2026