Six Pak cricket players got corona : ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ను కరోనా కలవరం కలిగిస్తోంది.. పాక్ జట్టులోని ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. కరోనా వైరస్‌ను నియంత్రించగలిగిన దేశంగా రికార్డు సృష్టించిన న్యూజిలాండ్… ఇలా కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ఆందోళన చెందుతోంది. నిజానికి న్యూజిలాండ్‌లో కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినట్టు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ అంటోంది. ఇలాగైతే ఉపేక్షించేది లేదని పాక్ క్రికెట్ టీమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.. ఎవరు కూడా తమ గదుల్లోంచి బయటకు రాకూడదని హెచ్చరించింది.. న్యూజిలాండ్ పర్యటన కోసం ప్లేయర్లు, టీమ్ మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది ఇలా మొత్తం 53 మంది న్యూజిలాండ్‌కు వెళ్లారు.. పాకిస్తాన్ నుంచి బయలుదేరే ముందు లాహోర్‌లో వీరందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ టెస్ట్‌లలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అందరికీ నెగటివే వచ్చింది.. అయితే న్యూజిలాండ్‌కు చేరుకున్న తర్వాత చేసిన టెస్ట్‌లలో మాత్రం ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వారికి కనీసం మరో నాలుగుసార్లు పరీక్షలను నిర్వహిస్తామని చెప్పింది న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ. పాకిస్తాన్ పర్యటన తమకు ఆనందం కలిగిస్తున్నదని, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అయితే అదే సమయంలో ఇక్కడి నిబంధనలకు కూడా కట్టబడి ఉండాలి కదా అని హెల్త్ డిపార్ట్‌మెంట్ అంటోంది. కఠినమైన కోవిడ్ నిబంధనలతో, లాక్‌డౌన్‌లతో పాటు ప్రజలు కూడా క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ లేకుండా పోయింది.. అసలు ఇప్పటి వరకు ఆ దేశంలో నమోదైనవి కేవలం 1,684 పాజిటివ్ కేసులే అంటే ఆశ్చర్యం కలగకమానదు.. న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తన్ మూడు టీ-20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్‌లు ఆడుతుంది.