బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష..

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ సంచలన తీర్పు వెల్లడించింది. గత ఏడాదినాటి ఢాకా అల్లర్ల కేసులో హసీనాను దోషిగా నిర్ధారించింది కోర్టు. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మాయని మచ్చగా న్యాయస్థానం అభివర్ణించింది.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష..
Bangladesh Expm

Updated on: Nov 17, 2025 | 2:48 PM

బంగ్లాదేశ్‌ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు కోర్టు మరణ శిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ICT దోషిగా తేల్చింది. గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ICT న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది.

ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ICT చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.