Serbia: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన సెర్బియా జనం.. అధికారిక భవనం ఆక్రమించే యత్నం..!

యూరోపియన్ దేశం సెర్బియాలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఇక్కడ కోపంతో ఉన్న జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 24న బెల్‌గ్రేడ్‌లోని చారిత్రాత్మక భవనం సిటీ హాల్‌లోకి ఆందోళనకారులు ప్రవేశించడానికి ప్రయత్నించారు.

Serbia: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన సెర్బియా జనం.. అధికారిక భవనం ఆక్రమించే యత్నం..!
Serbia Protests

Updated on: Dec 25, 2023 | 4:08 PM

యూరోపియన్ దేశం సెర్బియాలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఇక్కడ కోపంతో ఉన్న జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 24న బెల్‌గ్రేడ్‌లోని చారిత్రాత్మక భవనం సిటీ హాల్‌లోకి ఆందోళనకారులు ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.

సిటీ హాల్ వెలుపల గుంపులో ఉన్న కొంతమంది కిటికీలు పగలగొట్టి, బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో, ఆందోళనకారులు భద్రతా బలగాలతో కూడా ఘర్షణ పడ్డారు. చివరికి ఆందోళనకారులను తరిమికొట్టడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. పోలీసులు మితిమీరిన బలవంతంగా ప్రయోగించారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అధికార పార్టీ గెలుపొందిన ఎన్నికల్లో ప్రభుత్వం అవకతవకలు చేసిందని ఆరోపించారు. అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ ఆరోపణలు అర్ధంలేనివి అని కొట్టి పారేశారు.

సెర్బియాలో డిసెంబర్ 17న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. దీనిలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ సెర్బియా ఎగైనెస్ట్ వయొలెన్స్‌కు 23.5 శాతం ఓట్లు వచ్చాయి. మరో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ సెర్బియాకు 6.56 శాతం ఓట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్న 35 మందికి పైగా నాయకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఓటు రిగ్గింగ్‌ను ఆదేశ అధ్యక్షులు అలెగ్జాండర్ వుసిక్ ఖండించారు. దేశంలో జరిగిన ఎన్నికలను నిష్పక్షపాతంగా అభివర్ణించారు. ఓటింగ్ అక్రమాలకు సంబంధించిన వాదనలు రాజకీయ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న పచ్చి అబద్ధాలని వుసిక్ అన్నారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు విదేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…