లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!

లండన్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ కన్నుమూశారు. కెన్సింగ్‌టన్‌లోని ప్రముఖ మారియట్ హోటల్లోని తన గదిలో ఆయన విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. బ్రిటన్ యూకే కరోనర్ నిర్వహించిన విచారణలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతిగా మద్యం, పార్టీ డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులను ఒకేసారి తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!
Saudi Prince Dead

Updated on: Jul 24, 2026 | 12:59 PM

లండన్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ కన్నుమూశారు. కెన్సింగ్‌టన్‌లోని ప్రముఖ మారియట్ హోటల్లోని తన గదిలో ఆయన విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. బ్రిటన్ యూకే కరోనర్ నిర్వహించిన విచారణలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతిగా మద్యం, పార్టీ డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులను ఒకేసారి తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎట్టకేలకు యువరాజు మరణం మిస్టరీ వీడింది..

విలాసవంతమైన కెన్సింగ్‌టన్ మారియట్ హోటల్‌లో బస చేయడానికి నవంబర్ 19న ప్రిన్స్ అబ్దుల్లా చెక్-ఇన్ చేశారు. నవంబర్ 25న హోటల్ క్లీనర్ రూమ్‌ శుభ్రం చేయడానికి వెళ్లి చూడగా, ఐదవ అంతస్తులోని బాత్రూమ్ నేలపై ఆయన పూర్తి దుస్తులతో పడిపోయి ఉన్నారు. హోటల్ సిబ్బంది వెంటనే అత్యవసర వైద్య సేవలకు (పారామెడిక్స్) సమాచారం ఇచ్చినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మరణానికి ముందు రోజు సాయంత్రం సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లడమే సీసీటీవీలో చివరిసారిగా రికార్డయింది.

వైద్య పరీక్షల నివేదికల ప్రకారం, ప్రిన్స్ అబ్దుల్లా రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉంది. ఇది ఇంగ్లాండ్ చట్టబద్ధమైన డ్రింక్-అండ్-డ్రైవ్ పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆల్కహాల్‌తో పాటు ‘గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB)’ అనే ప్రమాదకర పార్టీ డ్రగ్, గంజాయి, జానాక్స్ (Xanax), కొన్ని ఆందోళన నివారణ మందులు (Anti-anxiety pills) కలిపి తీసుకోవడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి మరణించినట్లు నిపుణులు కోర్టుకు తెలిపారు.

ఇదిలావుంటే, మద్యపానం, ఔషధాల వ్యసనం నుండి బయటపడేందుకు ప్రిన్స్ అబ్దుల్లా గతంలో పలు పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందినట్లు విచారణలో తేలింది. ఆగస్టు 2025లో లండన్‌లోని ప్రయరీ క్లినిక్‌లోనూ, అక్టోబర్‌లో రైన్‌ఫోర్డ్ హాల్ క్లినిక్‌లోనూ డిటాక్స్ ప్రోగ్రామ్స్ పూర్తి చేశారు. అయితే, కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ ఈ అలవాట్లలోకి జారడం విశేషం.

ఇందులో ఎలాంటి కుట్ర గానీ, మూడో వ్యక్తి ప్రమేయం గానీ లేదని అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్ స్పష్టం చేశారు. అలాగే ఇది ఆత్మహత్య కాదని, అతిగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగిన ప్రమాదవశాత్తు మరణం అని తీర్పునిచ్చారు. ఈ విషాదంపై సౌదీ రాజ దర్బార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

సౌదీ రాజ దర్బారు డిసెంబర్ 2న ప్రిన్స్ అబ్దుల్లా మరణాన్ని బహిరంగంగా ప్రకటించింది. యువరాజు సౌదీ అరేబియా వెలుపల “సర్వశక్తిమంతుడైన దేవుని దయకు పాత్రులయ్యారని” అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, రాజకుటుంబంలోని కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం తరచుగా ఉపయోగించే రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతాయని ధృవీకరించారు. ఎట్టకేలకు సౌదీ యువరాజు మరణంపై దాగి ఉన్న మిస్టరీ వీడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us