Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. నెల రోజుల నుంచి రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ.. సాధ్యపడటం లేదు. రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అయితే.. ఇరుదేశాల్లో ఇప్పటివరకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలకు చెందిన చాలామంది మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మరణాలపై ఐక్యరాజ్యసమితి (United Nations) కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా ఇప్పటివరకు 1035 మంది పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం గురువారం వెల్లడించింది. ఇందులో 90 మంది చిన్నారులు ఉన్నారంటూ ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధంలో మరో 1650 మంది గాయాలపాలయ్యారని వెల్లడించారు.
మరియుపోల్, కీవ్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. వీటి ప్రకారం.. మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఫిరంగులు, మల్టీపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగానే ఎక్కువ మంది మరణించాని ఐరాస తెలిపింది. దీంతోపాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
ఈ యుద్ధానికి 4.3 మిలియన్ల మంది పిల్లలు ప్రభావితం అయినట్లు UNICEF ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని 18 ఏళ్లలోపు 7.5 మిలియన్ల మందిలో సగానికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. దాదాపు 1.8 మిలియన్లకు పైగా మంది విదేశాలకు వెళ్లిపోయారని యూనిసేఫ్ పేర్కొంది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. రష్యా తమపై రసాయన దాడులకు దిగుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. తమ పౌరులపై ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందంటూ గురువారం పేర్కొన్నారు.
Also Read: