Earthquake: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ! తెల్లవారుజామున భయంతో జనం పరుగులు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీప ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియాలోని పలు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. GFZ ప్రకారం భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Earthquake: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ! తెల్లవారుజామున భయంతో జనం పరుగులు
Philippines Earthquake

Updated on: Jun 08, 2026 | 7:22 AM

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీప ప్రాంతాన్ని సోమవారం ఉదయం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియాలోని పలు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

ప్రారంభంలో భూకంప తీవ్రతను 7.3గా నమోదు చేసిన సంస్థ, అనంతరం 8.2గా సవరించి, చివరికి 7.8గా ఖరారు చేసింది. ఈ భూకంపం మిండనావోలోని జనరల్ సాంటోస్ నగరానికి సమీపంలో సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం అనంతరం అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాలను భారీ అలలు ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో మూడు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాల్లో కూడా ఒక మీటరు వరకు అలలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఫిలిప్పీన్స్ అగ్నిపర్వత, భూకంప పరిశోధనా సంస్థ PHIVOLCS తొమ్మిది ప్రావిన్సుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ సముద్ర మట్టానికి మించి ఒక మీటరు కంటే ఎక్కువ ఎత్తులో అలలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అలాగే భూకంపం అనంతరం బలమైన ఆఫ్టర్‌షాక్స్ సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ ఘటనపై స్పందించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిండనావోలోని పాఠశాలలకు తాత్కాలిక సెలవులు ప్రకటిస్తూ, ప్రజలు సునామీ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నష్టం వివరాలను అంచనా వేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us