Pakistan: కర్మ ఫలం అనుభవిస్తున్న పాకిస్తాన్.. దాయాది దేశాన్ని వెంటాడుతోన్న పాపాలు

| Edited By: Janardhan Veluru

Sep 11, 2024 | 12:00 PM

Pakistan vs Taliban: విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగు దేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ, భారతదేశంపై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు కర్మ ఫలం అనుభవిస్తోంది. మనం ఒకరికి మంచి చేస్తే.. మనకు కూడా మంచి ఎదురవుతుందని, చేటు చేస్తే చెడే ఎదురవుతుందని పెద్దలు చెబుతుంటారు.

Pakistan: కర్మ ఫలం అనుభవిస్తున్న పాకిస్తాన్.. దాయాది దేశాన్ని వెంటాడుతోన్న పాపాలు
Pakistan Taliban Conflict
Follow us on

విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగు దేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ, భారతదేశంపై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు కర్మ ఫలం అనుభవిస్తోంది. మనం ఒకరికి మంచి చేస్తే.. మనకు కూడా మంచి ఎదురవుతుందని, చేటు చేస్తే చెడే ఎదురవుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇన్నేళ్లుగా భారతదేశంపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు తగిన మూల్యం ఇప్పుడు మరో రూపంలో చెల్లించుకుంటోంది. పొరుగునే ఉన్న అఫ్ఘనిస్తాన్ తరచుగా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూ తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అఫ్ఘనిస్తాన్‌ను పరిపాలిస్తున్న తాలిబన్లు పాకిస్తాన్‌లో కూడా తమ రాజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నారు. పాకిస్తాన్‌ను తాలిబన్ రాజ్యంగా మార్చే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ “తెహ్రీక్-ఏ-పాకిస్తాన్ తాలిబన్ (TTP)”కు అన్ని రకాలుగా సహకరిస్తూ పాకిస్తాన్‌ను ముప్పతిప్పలు పెడుతోంది.

ఎల్ఓసీ మాదిరిగా డ్యురాండ్ లైన్

భారతదేశంతో కాశ్మీర్ విషయంలో సరిహద్దు వివాదాన్ని మొదలుపెట్టిన పాకిస్తాన్‌ ఇప్పటికే కాశ్మీర్‌లోని చాలా భాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)గా భారతదేశం వ్యవహరిస్తూ.. ఏనాటికైనా ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. ప్రస్తుతానికి కాశ్మీర్‌లో ఉన్న తాత్కాలిక సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ తాత్కాలిక సరిహద్దుకు అవతలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇటు వైపున భారతదేశంలోని అంతర్భాగమైన కాశ్మీర్ ఉన్నాయి. ఇదెలా ఉంటే.. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ మధ్య సరికొత్తగా సరిహద్దు వివాదం నెలకొంది. పాకిస్తాన్ అవిభాజ్య భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న సమయంలోనే, బ్రిటీష్ పాలనలో 1893లో అప్ఘనిస్తాన్‌తో సరిహద్దును నిర్ణయించారు. ఆ సరిహద్దును ‘డ్యురాండ్ లైన్’గా వ్యవహరిస్తున్నారు. అప్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలన ఉన్న సమయంలో ఎప్పుడూ ఈ సరిహద్దుపై పెద్దగా వివాదం లేదు. అయితే 2021లో అప్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు తిరిగి హస్తగతం చేసుకున్న తర్వాత డ్యురాండ్ లైన్‌ను తాము ఒప్పుకోబోమంటూ ప్రకటించారు. కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా.. డ్యూరాండ్ లైన్ వెంట కొత్త సైనిక పోస్టులను నిర్మించారు. ఎల్వోసీ వెంట పాకిస్తాన్ సైనిక పోస్టులు ఏర్పాటు చేసి తరచుగా కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరహాలోనే డ్యూరాండ్ లైన్ వెంట తాలిబాన్ సైనిక బలగాలు తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ బలగాలకు ఆస్తి, ప్రాణనష్టాన్ని కల్గిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా తాలిబన్లు, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. తాజాగా జరిగిన సరిహద్దు కాల్పుల్లో సుమారు 8 మంది తాలిబాన్లు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఆఫ్ఘన్ తాలిబాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ కమాండర్లు ఖలీల్ మరియు జాన్ మహ్మద్ మరణించారని పాకిస్తాన్ చెబుతోంది. డ్యూరాండ్ లైన్‌లో ఇటీవల జరిగిన హింసలో పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ముహమ్మద్ అలీ మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.

ఇక్కడ లష్కర్, జైష్.. అక్కడ టీటీపీ

భారత్ విషయంలో పాకిస్తాన్ సరిహద్దు కవ్వింపులతోనే సరిపెట్టలేదు. మతం ఆధారంగా చేసుకుని భారత్‌లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. చేస్తూనే ఉంది. భారత్‌లో భారీ ప్రాణనష్టం కల్గించే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది, ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉంది. లష్కర్-ఏ-తోయిబా (LeT), జైష్-ఏ-మొహ్మద్ (JeM) సహా అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి, పోషించి భారత్‌లో విధ్వంసాలకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ముంబై నగరంపై సాయుధులైన పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన దాడిని యావత్ ప్రపంచం చూడగా.. అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకుని పాకిస్తాన్ కుట్రను భారతదేశం ప్రపంచానికి చూపించింది. ఈ పాపాలకు ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తోంది. ఓవైపు తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పాకిస్తాన్‌లో అంతర్గతంగా విధ్వంసాలు, మారణహోమాలు సృష్టిస్తూ భారీగా ప్రాణనష్టాన్ని కల్గిస్తోంది. కాశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి భారత్‌కు సమస్యలు సృష్టించిన పాకిస్తాన్.. బలూచిస్తాన్ రూపంలో వేర్పాటువాదాన్ని ఎదుర్కొంటోంది. బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ సైనికల బలగాలే లక్ష్యంగా భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇలా భారత్ విషయంలో చేసిన ప్రతి పాపానికీ రెట్టింపు మరో రూపంలో పాకిస్తాన్ అందుకుంటోంది.